ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్

  • సోషల్ మీడియాలో ప్రచారం
  • తన పేరుప్రతిష్ఠలకు భంగం కలుగుతోందన్న ఎన్టీఆర్
  • విచారణ చేపట్టిన జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా ధర్మాసనం
తన పేరుప్రతిష్ఠలకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందంటూ టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కొన్ని సోషల్ మీడియా ఖాతాలు, ఈ-కామర్స్ సైట్లు తన పేరు, ఫొటోలను వాడుతూ అభ్యంతరకరమైన, తప్పుడు సమాచారంతో కూడిన పోస్టులను వ్యాప్తి చేస్తున్నాయని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సోమవారం జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఎన్టీఆర్ తరఫున న్యాయవాది జె. సాయిదీపక్ వాదనలు వినిపించారు. తన క్లయింట్ వ్యక్తిగత హక్కులకు, ప్రతిష్ఠకు హాని కలిగించేలా ఉన్న పోస్టులను తక్షణమే తొలగించాలని, వాటిని ప్రచారం చేసిన వారిపై 2021 ఐటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను, స్క్రీన్‌షాట్‌లను కోర్టుకు సమర్పించారు. ముందుగా ఆయా సోషల్ మీడియా సంస్థలను సంప్రదించి పోస్టుల తొలగింపునకు ప్రయత్నించాలని, అప్పటికీ ఫలితం లేకపోతేనే కోర్టును ఆశ్రయించాలని న్యాయమూర్తి సూచించారు.

ఇక, వాదనలు విన్న న్యాయస్థానం... ఫేస్‌బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియా సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అభ్యంతరకరమైన కంటెంట్‌ను మూడు రోజుల్లోగా తొలగించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 22వ తేదీకి వాయిదా వేసింది. 

గతంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ విషయంలోనూ ఢిల్లీ హైకోర్టు ఇలాంటి ఆదేశాలే ఇచ్చిందని ఎన్టీఆర్ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సోషల్ మీడియాలో పరువు నష్టంపై ఇటీవల నాగార్జున, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ వంటి ప్రముఖులు కూడా న్యాయపోరాటం చేసిన విషయం తెలిసిందే.


More Telugu News