ఐబొమ్మ రవి కేసు: కస్టడీ పొడిగింపు కోరుతూ కోర్టులో రివిజన్ పిటిషన్

  • విచారణకు మూడు రోజుల సమయం సరిపోదన్న అధికారులు
  • మొత్తం ఐదు రోజుల కస్టడీకి కోరుతూ రివిజన్ పిటిషన్ 
  • సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉందన్న అధికారులు
సినిమా పైరసీ కేసుల్లో అరెస్టయిన ఐబొమ్మ నిర్వాహకుడు రవి కస్టడీ వ్యవహారంలో సైబర్ క్రైమ్ పోలీసులు మరో ముందడుగు వేశారు. విచారణకు కోర్టు కేటాయించిన మూడు రోజుల సమయం సరిపోదని భావించిన పోలీసులు, కస్టడీని పొడిగించాలని కోరుతూ న్యాయస్థానంలో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. లోతైన విచారణకు ఈ సమయం ఏమాత్రం సరిపోదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

రవిపై నమోదైన మూడు కేసులకు సంబంధించి ఒక్కో రోజు చొప్పున కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. అయితే, మొత్తం నాలుగు కేసుల్లోనూ సమగ్రంగా విచారించాల్సి ఉందని, ఇందుకు గాను ఐదు రోజుల కస్టడీ అవసరమని పోలీసులు తమ పిటిషన్‌లో కోరారు. ముఖ్యంగా ‘కుబేర’, ‘కిష్కింద పురి’, ‘తండేల్’, ‘హిట్’ వంటి భారీ చిత్రాల పైరసీ వెనుక ఉన్న కీలక సమాచారాన్ని రవి నుంచి రాబట్టాల్సి ఉందని వివరించారు.

ఈ సినిమాల పైరసీకి సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టేందుకు అదనపు కస్టడీ తప్పనిసరి అని పోలీసులు కోర్టుకు నివేదించారు. ఈ రివిజన్ పిటిషన్‌పై న్యాయస్థానం తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోర్టు పోలీసుల అభ్యర్థనను అంగీకరిస్తుందో లేదో వేచి చూడాలి.


More Telugu News