ఏ అథ్లెట్‌కైనా ఇది స్వర్గం లాంటిది: శుభ్ మన్ గిల్

  • మెడ గాయం నుంచి కోలుకున్న గిల్ 
  • బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌పై ప్రశంసలు
  • అక్కడ ఉన్న సౌకర్యాలు, అత్యాధునిక మెషీన్లు అద్భుతమని వెల్లడి
టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం నుంచి పూర్తిగా కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు. రేపటి నుంచి దక్షిణాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్‌కు తాను సంపూర్ణంగా సిద్ధమయ్యానని ప్రకటించాడు. తాను ఇంత త్వరగా కోలుకోవడానికి బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) ఎంతగానో దోహదపడిందని గిల్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఏ అథ్లెట్‌కైనా ఈ కేంద్రం ఒక స్వర్గం లాంటిదని అభివర్ణించాడు. తన రికవరీ ప్రయాణం, జాతీయ క్రికెట్ అకాడమీలోని సౌకర్యాలు, తన జూనియర్ క్రికెట్ రోజుల జ్ఞాపకాలను గిల్ ఓ వీడియోలో పంచుకున్నాడు.

గత నెల కోల్‌కతాలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ మెడకు గాయమైన విషయం తెలిసిందే. ఈ గాయం కారణంగా అతను రెండో టెస్టుతో పాటు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అనంతరం నేరుగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు చేరుకుని రిహాబిలిటేషన్ ప్రారంభించాడు. అక్కడ నిపుణుల పర్యవేక్షణలో ఫిట్‌నెస్ సాధించి, మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం జట్టుతో కలిశాడు.

ఈ సందర్భంగా బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో గిల్ తన అనుభవాలను వివరించాడు. "నేను ఇప్పుడు చాలా బాగున్నాను. ఇక్కడికి వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు అనేక స్కిల్ సెషన్స్, ట్రైనింగ్ సెషన్స్‌లో పాల్గొన్నాను. శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారయ్యేందుకు ఒక అథ్లెట్‌కు ఇంతకంటే మంచి ప్రదేశం ఉండదు. నిజొంగా ఇది అథ్లెట్లకు స్వర్గధామం" అని గిల్ పేర్కొన్నాడు.

జాతీయ క్రికెట్ అకాడమీలోని అత్యాధునిక సౌకర్యాల గురించి గిల్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. "ఇక్కడ ఉన్న సౌకర్యాల గురించి ఎంత చెప్పినా తక్కువే. రికవరీ కోసం ఆక్సిజన్ ఛాంబర్, క్రయోథెరపీ వంటివి ఉపయోగించాను. అవి నాకు అద్భుతంగా పనిచేశాయి. నిజం చెప్పాలంటే, ఇక్కడ చాలా యంత్రాలు ఉన్నాయి. వాటిని ఎలా ఉపయోగించాలో కూడా నాకు తెలియదు. దీన్ని బట్టే ఈ సెటప్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు" అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

తన అండర్-14, అండర్-16 రోజుల నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, "మేం చిన్నప్పుడు రాష్ట్రస్థాయిలో ఆడేవాళ్లం. అప్పట్లో ఎవరైనా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లి వచ్చారంటే, వారిని చాలా ప్రత్యేకంగా చూసేవాళ్లం. అండర్-16 స్టేట్ టోర్నీలో ఫైనల్స్ ఆడితే దాదాపు 200 మందిలో కేవలం 25-30 మందిని మాత్రమే జాతీయ అకాడమీ క్యాంప్‌కు ఎంపిక చేసేవారు. జాతీయ అకాడమీకి వెళ్లడం అనేది మా అందరికీ ఒక పెద్ద గౌరవంగా ఉండేది. ఇక్కడికి వస్తున్నామంటే, మనం దేశంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరమని అర్థం" అని గిల్ తెలిపాడు.

జాతీయ క్రికెట్ అకాడమీలోని కోచ్‌లు, ట్రైనర్లు, ఫిజియోల కృషిని కూడా గిల్ అభినందించాడు. "మనతో పనిచేయడానికి ఇక్కడ అత్యుత్తమ కోచ్‌లు, ట్రైనర్లు అందుబాటులో ఉంటారు. అయితే, ఆ సౌకర్యాలను ఉపయోగించుకుని మనల్ని మనం మెరుగుపరుచుకోవాలనే సంకల్పం ఆటగాడికి ఉండాలి. అదే మిగతా ఆటగాళ్లకు, మనకు మధ్య తేడాను చూపిస్తుంది" అని వివరించాడు. కాగా, మంగళవారం కటక్‌లోని బారాబతి స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి టీ20లో గిల్ బరిలోకి దిగనున్నాడు.


More Telugu News