టాక్స్ రిఫండ్ ఇంకా రాలేదా.. ఈ ఐదు పొరపాట్లే కారణం కావొచ్చు!

  • ఈ నెలాఖరుకల్లా రిఫండ్ చేస్తామన్న సీబీడీటీ ఛైర్మన్ రవి అగర్వాల్
  • చాలామందికి ఇప్పటికీ అందని టాక్స్ రిఫండ్ డబ్బులు
  • ఎదురుచూడడం మాత్రమే సరిపోదంటున్న నిపుణులు
  • పొరపాట్లు ఏమైనా చేశామా అనేది చెక్ చేసుకోవాలని సూచన
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ చాలామందికి రిఫండ్ రాలేదు. నిత్యం కొన్ని వేల మంది ఇంకా రిఫండ్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఐటీ రిటర్న్స్ కోసం దాఖలు చేసిన వివరాలను సరిచూసుకుని అధికంగా కట్టిన మొత్తాన్ని పన్నుదారుడికి తిరిగివ్వడం చాలా పెద్ద ప్రక్రియ అని సీబీడీటీ చీఫ్ రవి అగర్వాల్ తెలిపారు. 

రిటర్న్స్ ఫైలింగ్ లో పేర్కొన్న లావాదేవీలను పరిశీలించడం, సరిచూసుకోవడానికి కొంత ఆలస్యం జరగడం సాధారణమేనని చెప్పారు. పెద్ద మొత్తంలో రిటర్న్స్ కోసం దాఖలు చేసిన వాటిని, అనుమానిత వ్యవహారాలను మరింత నిశితంగా పరిశీలించాల్సి వస్తుందన్నారు. అయితే, ఈ నెలాఖరులోగా అందరికీ టాక్స్ రిఫండ్ చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

అదేవిధంగా రిటర్న్స్ కోసం ఫైలింగ్ చేసినప్పుడు పన్నుదారుడు చేసే ఐదు పొరపాట్ల కారణంగా కూడా రిఫండ్ ఆలస్యం కావొచ్చని ఆయన చెప్పారు. రిఫండ్ కోసం ఎదురుచూస్తుండడం కాకుండా పొరపాట్లు ఏమైనా చేశామా? అనేది చెక్ చేసుకోవాలని, ఐటీ శాఖ నుంచి వచ్చే మెయిల్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించారు.

ప్రధానంగా చేసే ఐదు పొరపాట్లు..
  • ఐటీఆర్ ఫైలింగ్ లో చాలామంది చేసే సాధారణ పొరపాటు.. బ్యాంకు ఖాతా వివరాల్లో తప్పులు. ఖాతా నెంబర్ కానీ, ఐఎఫ్ఎస్ సీ కోడ్ తప్పుగా ఎంటర్ చేయడం వల్ల కానీ రిఫండ్ ఆలస్యమవుతుంది.
  • బ్యాంకు ఖాతాలోని పేరుకు, పాన్ కార్డు మీద ఉన్న పేరు సరిగ్గా మ్యాచ్ కాకపోతే.. అంటే రెండుచోట్లా పేరు ఒకేలా లేకున్నా, స్పెల్లింగ్ లో తేడాలు ఉన్నా రిఫండ్ ఆలస్యమవుతుంది.
  • ఇన్ కం టాక్స్ పోర్టల్ లో ప్రి వాలిడేట్ అయిన బ్యాంకు ఖాతాల్లోనే రిఫండ్ జమవుతుంది. ప్రి వాలిడేట్ కాని ఖాతాల విషయంలో రిఫండ్ ఆగిపోతుంది.
  • పాన్ కార్డ్ ను ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడం తప్పనిసరి. కార్డులను లింక్ చేయని ఖాతాదారులకు చెల్లించాల్సిన రిఫండ్ ను ఐటీ శాఖ విత్ హోల్డ్ చేస్తుంది.
  • రిఫండ్ కోసం దాఖలు చేసిన మొత్తాన్ని లెక్కించడంలో పొరపాటు చేసినా, మినహాయింపు కోరిన లావాదేవీలు వాలిడ్ కాకపోయినా రిఫండ్ ను ఆపేసి అధికారులు విచారణ చేపడతారు.

రిఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే..
ఇన్‌ కం టాక్స్ ఇ- ఫైలింగ్ పోర్టల్‌ లోకి వెళ్లి యూజర్ ఐడీ, పాస్‌ వర్డ్ తో లాగిన్ కావాలి. ఇ- ఫైల్ సెక్షన్‌లో ఇన్‌కంటాక్స్ రిటర్న్స్‌పై క్లిక్ చేసి వ్యూ ఫైల్డ్ రిటర్న్స్‌ను సెలక్ట్ చేయాలి. అక్కడ అసెస్‌మెంట్ ఇయర్ ఆధారంగా.. రిఫండ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.


More Telugu News