గోవా అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

  • గోవా నైట్‌క్లబ్‌లో ఘోర అగ్నిప్రమాదం 
  • గ్యాస్ సిలిండర్ పేలడంతో 25 మంది మృతి
  • ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందన్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
  • చాలా బాధాకరమైన సంఘటన అన్న ప్రధాని మోదీ  
  • మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన
గోవాలోని ఓ ప్రముఖ నైట్‌క్లబ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగి 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర గోవాలోని అర్పోరా ప్రాంతంలో ఉన్న బిర్స్ నైట్‌క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

క్లబ్‌లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మృతుల్లో 16 మంది క్లబ్ సిబ్బంది, ముగ్గురు మహిళలు, నలుగురు పర్యాటకులు ఉన్నారు. కొందరు మంటల్లో చిక్కుకుని మరణించగా, ఎక్కువ మంది దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు భావిస్తున్నారు.

ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందిస్తూ, ఇది చాలా బాధాకరమైన సంఘటన అని అన్నారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అవసరమైన అన్ని సహాయక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


More Telugu News