ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డికి నెల రోజుల జైలుశిక్ష

  • రూ. 2 వేల జరిమానా కూడా విధిస్తూ హైకోర్టు తీర్పు
  • ఉత్తర్వులు అమలు చేయకుండా మొండి వైఖరి ప్రదర్శించారని వ్యాఖ్య
  • అప్పీల్ కోసం తీర్పు అమలును ఆరు వారాలు సస్పెండ్
కోర్టు ఉత్తర్వులను ధిక్కరించిన కేసులో ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) మాజీ ఉపకులపతి (వీసీ) పీవీజీడీ ప్రసాదరెడ్డికి హైకోర్టు నెల రోజుల సాధారణ జైలుశిక్ష విధించింది. దీంతో పాటు రూ.2 వేల జరిమానా కూడా విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాల పట్ల ప్రసాదరెడ్డి తీవ్ర నిర్లక్ష్యం వహించారని, మొండి వైఖరి అవలంబించారని న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ఏయూ బోటనీ విభాగంలో 17 ఏళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న నూకన్నదొరను 2022లో విధుల నుంచి తొలగించారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని 2023 మార్చిలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, అప్పటి వీసీ ప్రసాదరెడ్డి ఈ ఆదేశాలను అమలు చేయలేదు. దీంతో నూకన్నదొర కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు.. ప్రసాదరెడ్డి ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని నిర్ధారించారు. దీంతో జైలుశిక్ష, జరిమానా విధుస్తూ గత నెల 20న తీర్పు ఇచ్చారు. తీర్పు ప్రతి తాజాగా అందుబాటులోకి వచ్చింది. వీసీగా పదవి నుంచి దిగిపోయే వరకు ఆదేశాలు అమలు చేయలేదని, కొత్త వీసీ వచ్చాకే అవి అమలయ్యాయని పేర్కొన్నారు. ఇలాంటి వారిపై కనికరం చూపిస్తే న్యాయవ్యవస్థకు నష్టం కలుగుతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు.

అయితే, ప్రసాదరెడ్డి తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు.. అప్పీల్ దాఖలు చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలును ఆరు వారాల పాటు సస్పెండ్ చేసింది. ఈ లోగా అప్పీల్‌లో స్టే రాకపోతే, డిసెంబర్ 22వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు హైకోర్టు రిజిస్ట్రార్ ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.


More Telugu News