ఇండిగో సంక్షోభం.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు, శంషాబాద్ నుంచి బస్సులు

  • ప్రయాణికులను గమ్యస్థానాలకు తరలించడానికి ముందుకు వచ్చిన రైల్వే శాఖ
  • దేశవ్యాప్తంగా 37 ప్రీమియం రైళ్లు నడుపుతున్న భారతీయ రైల్వే
  • ఆ రైళ్లకు అదనంగా 116 కోచ్‌లను జత చేస్తున్నట్లు తెలిపిన భారతీయ రైల్వే
దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు పెద్ద సంఖ్యలో రద్దు కావడంతో విమానాశ్రయాల్లో నిలిచిపోయిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు భారతీయ రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా 37 ప్రీమియం రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లకు అదనంగా 116 కోచ్‌లను జత చేస్తున్నట్లు తెలిపింది. దీని ద్వారా మొత్తం 114 అదనపు ట్రిప్పులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది.

సికింద్రాబాద్-చెన్నై, చర్లపల్లి-కోల్‌కతా, హైదరాబాద్-ముంబై మార్గాల్లో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తెలంగాణ ఆర్టీసీ సైతం శంషాబాద్ విమానాశ్రయం నుంచి చెన్నై, బెంగళూరు నగరాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. చెన్నైకి ఒక్కొక్కరికి రూ.2,110, బెంగళూరుకు రూ.1,670 ఛార్జీ వసూలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖపట్నం వైపు కూడా అదనపు బస్సులను నడుపుతున్నారు.

సౌత్ వెస్ట్ రైల్వే, సెంట్రల్, సౌత్ ఈస్టర్న్, సదర్న్ రైల్వే కూడా అదనపు రైళ్లను ప్రకటించాయి. డిసెంబర్ 6 నుంచి 10వ తేదీ మధ్య బెంగళూరు-చెన్నై, బెంగళూరు-పుణే, యశ్వంతపూర్-హజ్రత్ నిజాముద్దీన్, శాలిమార్-యెలహంక, ఎర్నాకులం-యెలహంక మార్గాల్లో రైళ్లు నడపనున్నట్లు సౌత్ వెస్ట్ రైల్వే తెలిపింది.


More Telugu News