మంత్రి నారా లోకేశ్ ను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

  • విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశంసలు
  • విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడంపై అభినందనలు
  • మెగా పేరెంట్-టీచర్ మీటింగ్స్ నిర్వహణను ప్రత్యేకంగా కొనియాడిన పవన్
  • సీఎం చంద్రబాబు నాయకత్వంలో జరుగుతున్న కృషి ప్రశంసనీయమన్న జనసేనాని
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పనితీరుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలనే ధృడ సంకల్పంతో లోకేశ్ చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు.

విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో, అధునాతన సదుపాయాలు కల్పించి, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని, నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సంస్కరణల ప్రక్రియలో తల్లితండ్రులను, ఉపాధ్యాయులను భాగస్వాములను చేసేందుకు నిర్వహిస్తున్న 'మెగా పేరెంట్-టీచర్ మీటింగ్స్' ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు.

ఇటువంటి సమావేశాల్లో తాను పాల్గొనడం ఆనందంగా ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు మంత్రిగా లోకేశ్ చూపుతున్న చొరవను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. 

నిన్న ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్ మీటింగ్స్ జరగడం తెలిసిందే. చిలకలూరిపేటలో జరిగిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. అందుకు గాను పవన్ కు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో స్పందిస్తూ పవన్ కల్యాణ్ పై విధంగా అభినందనలు తెలిపారు. 


More Telugu News