ఆపరేషన్‌లో ఘోర నిర్లక్ష్యం... సీఎం చంద్రబాబు ఆదేశాలతో నరసరావుపేట ప్రభుత్వ వైద్యుడిపై వేటు

  • ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసి మహిళ కడుపులో బ్లేడ్ మర్చిపోయిన ఘటన
  • విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించినట్టు విచారణలో వెల్లడి
  • వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశం
  • ఉత్తర్వులు జారీ చేసిన వైద్యారోగ్య శాఖ
విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఆసుపత్రి సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ టి. నారాయణ స్వామిని సస్పెండ్ చేస్తూ వైద్యారోగ్య శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.

గత నెల 26న నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళకు డాక్టర్ నారాయణ స్వామి ట్యూబెక్టమీ ఆపరేషన్ నిర్వహించారు. అయితే, ఆపరేషన్ సమయంలో ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించి, సర్జికల్ బ్లేడ్‌ను మహిళ కడుపులోనే వదిలేసి కుట్లు వేశారు. ఆ తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించగా, ప్రాథమిక విచారణ నివేదికలో వైద్యుడి నిర్లక్ష్యం స్పష్టంగా రుజువైంది. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. బాధ్యులైన వైద్యుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో స్పందించిన ఉన్నతాధికారులు డాక్టర్ నారాయణ స్వామిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 


More Telugu News