నా కొడుకైనా తప్పు చేస్తే శిక్ష తప్పదు: మంత్రి పొంగులేటి

  • తమ కుటుంబ సంస్థ రాఘవ కన్‌స్ట్రక్షన్‌పై కేసుపై పొంగులేటి స్పందన
  • అధికారాన్ని అడ్డుపెట్టుకొని కేసును ఆపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని వ్యాఖ్య
  • విచారణకు పూర్తి స్వేచ్ఛనిస్తామన్న పొంగులేటి 
తప్పు చేస్తే తన కుమారుడైనా శిక్షకు అర్హుడేనని, చట్టం ముందు అందరూ సమానమేనని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తన కుటుంబానికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థపై నమోదైన భూ వివాదం కేసుకు సంబంధించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కొంతకాలం క్రితం, ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూమిలోకి జేసీబీలతో ప్రవేశించి కూల్చివేతలకు పాల్పడ్డారనే ఆరోపణలతో రాఘవ కన్‌స్ట్రక్షన్‌పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాక్ష్యాధారాలతో కూడిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దాడి, దౌర్జన్యం కింద కేసు నమోదు చేశారు.

ఈ విషయంపై అధికారులతో జరిగిన ఓ సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, "తప్పు చేసినప్పుడు నేను అయినా, నా కొడుకు అయినా శిక్ష అనుభవించాల్సిందే. ప్రతిపక్షాలు కేసులు పెట్టించాయని చెప్పడం సరికాదు. మేము ప్రభుత్వంలో ఉన్నామని నా కుమారుడిపై కేసు నమోదు చేయవద్దని చెప్పే ఉద్దేశం మాకు లేదు" అని అన్నారు. 

కేసు నమోదైన తర్వాత విచారణలో నిజ నిర్ధారణ జరుగుతుందని, తప్పు తేలితే చట్ట ప్రకారం శిక్ష పడుతుందని ఆయన వివరించారు. ఒకవేళ ఆరోపణల్లో నిజం లేకపోతే, వార్తలు రాసిన వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని మంత్రి వ్యాఖ్యానించారు.


More Telugu News