షమీ ఎక్కడ?.. సెలెక్టర్లపై హర్భజన్ సింగ్ ఫైర్

  • మహ్మద్ షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్
  • దేశవాళీ క్రికెట్‌లో షమీ అద్భుతంగా రాణిస్తున్నాడని వెల్లడి
  • బుమ్రా లేని భారత బౌలింగ్ విభాగం బలహీనంగా ఉందని వ్యాఖ్య
  • వైట్‌బాల్ క్రికెట్‌లో మ్యాచ్ విన్నర్లు కరువయ్యారని ఆందోళన
టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, భారత జట్టు యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. వెటరన్ పేసర్ మహ్మద్ షమీని జట్టులోకి తీసుకోకపోవడాన్ని ఆయన ప్రశ్నించాడు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ షమీని పక్కనపెట్టడం సరికాదన్నాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో షమీ ఐదు మ్యాచ్‌లలో తొమ్మిది వికెట్లు తీయగా, చివరి మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.

తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడిన హర్భజన్ "అసలు షమీ ఎక్కడ? అతడిని ఎందుకు ఆడించడం లేదో నాకు అర్థం కావడం లేదు. ప్రసిద్ధ్ కృష్ణ మంచి బౌలరే, కానీ అతడు ఇంకా చాలా నేర్చుకోవాలి. మంచి బౌలర్లను మీరు నెమ్మదిగా పక్కనపెడుతున్నారు" అని అన్నాడు. జస్ప్రీత్ బుమ్రా జట్టులో లేకపోవడం బౌలింగ్ విభాగాన్ని బలహీనపరుస్తోందని అభిప్రాయపడ్డాడు. "బుమ్రా ఉంటే మన బౌలింగ్ విభాగం ఒకటి, అతను లేకపోతే పూర్తిగా మరొకటి. బుమ్రా లేకుండా కూడా మ్యాచ్‌లు గెలవడం మనం నేర్చుకోవాలి" అని ఆయన స్పష్టం చేశారు.

వైట్ బాల్ క్రికెట్‌లో మ్యాచ్‌లు గెలిపించే బౌలర్లు జట్టులో కరువయ్యారని, ఇది పెద్ద ఆందోళన కలిగించే విషయమని భజ్జీ పేర్కొన్నారు. "ఇంగ్లండ్‌లో బుమ్రా లేనప్పుడు సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. స్పిన్నర్లలో కుల్దీప్ ఉన్నాడు, కానీ మిగతావాళ్ల సంగతేంటి? వికెట్లు తీయగల స్పిన్నర్లను గుర్తించాలి. వరుణ్ చక్రవర్తిని టీ20లతో పాటు వన్డేల్లోకి కూడా తీసుకురావాలి" అని సూచించాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ 359 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేక ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్భజన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ ఓటమితో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ప్రొటీస్ జట్టు 1-1తో సమం చేసింది.


More Telugu News