తనకంటే అందంగా ఉన్నారని ముగ్గురు బాలికల హత్య.. అనుమానం రాకుండా కొడుకునూ చంపేసిన మహిళ!

  • నీళ్ల టబ్బులు, ట్యాంకుల్లో ముంచి ప్రమాదాలుగా చిత్రీకరణ
  • పెళ్లి వేడుకలో బాలిక మృతితో వెలుగులోకి వచ్చిన దారుణాలు
  • హర్యానాలో నిందితురాలు పూనమ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
హర్యానాలో అత్యంత దారుణమైన, విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. తనకంటే అందంగా ఉన్నారన్న అసూయతో ముగ్గురు బాలికలను ఓ మహిళ అత్యంత కిరాతకంగా హత్య చేసింది. ఈ హత్యలపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కన్న కొడుకును సైతం బలితీసుకుంది. ఈ సీరియల్ కిల్లింగ్స్ హర్యానాలోని పానిపట్, సోనిపట్ జిల్లాల్లో రెండేళ్లుగా జరుగుతుండగా, ఇటీవల జరిగిన ఓ చిన్నారి మృతితో అసలు నిజం బయటపడింది. నిందితురాలైన 32 ఏళ్ల పూనమ్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం నౌల్తా గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకలో ఆరేళ్ల విధి అనే బాలిక అదృశ్యమైంది. కాసేపటి తర్వాత ఇంటి మొదటి అంతస్తులోని ఓ గదిలో నీటితో నిండిన ప్లాస్టిక్ టబ్బులో శవమై కనిపించింది. కేవలం అడుగు లోతున్న టబ్బులో చిన్నారి మునిగి చనిపోవడంపై పోలీసులకు అనుమానం వచ్చింది. కేవలం 36 గంటల్లోనే కేసును ఛేదించి, బాలిక పిన్ని అయిన పూనమ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆమె తన నేరాలన్నింటినీ అంగీకరించింది.

అందమైన ఆడపిల్లలను చూస్తే తనకు ద్వేషం, అసూయ కలిగేవని నిందితురాలు పోలీసులకు చెప్పింది. వారు పెరిగి పెద్దయ్యాక తనకంటే అందంగా ఉంటారనే అక్కసుతో హత్యలు చేసినట్లు ఒప్పుకుంది. 2023లో సోనిపట్‌లోని తన అత్తగారి ఇంట్లో తొమ్మిదేళ్ల ఆడపడుచు కూతురిని నీళ్ల ట్యాంకులో ముంచి చంపేసింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులకు తనపై అనుమానం రాకుండా ఉండేందుకు, ఆ తర్వాత మూడు నెలలకే తన మూడేళ్ల కుమారుడు శుభంను కూడా ఇదే పద్ధతిలో హత్య చేసింది. ఈ ఏడాది ఆగస్టులో పానిపట్‌లోని తన పుట్టింట్లో బంధువుల అమ్మాయిని కూడా ఇలాగే చంపేసింది.

ప్రతి హత్యను ప్రమాదవశాత్తు జరిగినట్లు చిత్రీకరించడంలో నిందితురాలు విజయవంతమైంది. దీంతో కుటుంబ సభ్యులు కూడా ప్రమాదాలుగానే భావించి అంత్యక్రియలు పూర్తిచేశారు. నిందితురాలు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పానిపట్ ఎస్పీ భూపేందర్ సింగ్ తెలిపారు. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా పాత కేసుల ఫైళ్లను తిరిగి తెరుస్తున్నట్లు వెల్లడించారు.


More Telugu News