ఆరు నెలల్లో 40 వేల కొలువులు.. పదేళ్లు నేనే సీఎం: రేవంత్ రెడ్డి ధీమా

  • యువతకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త
  • ప్రధాని మోదీతో రేవంత్ కీలక భేటీ
  • రాష్ట్ర అభివృద్ధికి,ప్రాజెక్టులకు సహకరించాలని విజ్ఞప్తి
  • పదేళ్ల పాటు స్థిరమైన ప్రభుత్వం ఉంటుందన్న సీఎం
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ శుభవార్త అందించారు. వచ్చే ఆరు నెలల్లో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి తీరుతామని స్పష్టమైన హామీ ఇచ్చారు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన ‘ప్రజాపాలన విజయోత్సవ సభ’లో ప్రసంగించిన ఆయన, తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని నిరూపిస్తామన్నారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

హుస్నాబాద్ వేదికగా బీఆర్ఎస్‌పై గర్జన
"లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు.. ఇవాళ 'కూలేశ్వరం'గా ఎందుకు మారింది?" అంటూ సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్, హరీశ్ రావులు తమ నియోజకవర్గాలైన గజ్వేల్, సిద్దిపేటలకు నిధులు తరలించుకుపోయి, ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన హుస్నాబాద్‌ను పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో హుస్నాబాద్ రూపురేఖలు మారుస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని పాతబడిన ఐటీఐల స్థానంలో, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు రూ.2000 కోట్లతో అడ్వాన్స్‌డ్ ట్రెయినింగ్ సెంటర్లు (ఏటీసీ) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

ఢిల్లీలో దౌత్యం.. ప్రధానితో భేటీ
హుస్నాబాద్ సభకు ముందు, ముఖ్యమంత్రి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. "గతంలో గుజరాత్ మోడల్ అభివృద్ధికి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎలా సహకరించారో, ఇప్పుడు మీరు తెలంగాణ మోడల్‌ను దేశానికి ఆదర్శంగా నిలిపే మా ప్రయత్నానికి అలాగే చేయూతనివ్వాలి" అని రేవంత్ రెడ్డి ప్రధానిని కోరారు. హైదరాబాద్-బెంగళూరు-చెన్నై బుల్లెట్ ట్రైన్ కారిడార్, మెట్రో రైల్ రెండో దశ, రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం వంటి ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు కేటాయించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ "రాష్ట్రంలో పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. రెండు టర్ములు నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతాను" అని ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News