బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్

  • దద్దరిల్లిన ఛత్తీస్‌గఢ్‌ అడవులు
  • 12 మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం
  • కాల్పుల్లో ముగ్గురు డీఆర్‌జీ జవాన్లు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. బీజాపూర్-దంతేవాడ అంతర్ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.

పశ్చిమ బస్తర్ డివిజన్ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై సమాచారం అందడంతో భద్రతా బలగాలు కూంబింగ్ ప్రారంభించాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరణించిన జవాన్లను హెడ్ కానిస్టేబుల్ మోను వాడారి, కానిస్టేబుల్ దుకారు గొండే, జవాన్ రమేష్ సోడిగా గుర్తించారు. గాయపడిన మరో ఇద్దరు సిబ్బందిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

ఘటనా స్థలం నుంచి ఎస్‌ఎల్‌ఆర్, ఇన్సాస్, 303 రైఫిళ్లు వంటి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టి, అదనపు బలగాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ ఆపరేషన్‌పై బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ మాట్లాడుతూ, ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నందున పూర్తి వివరాలను వెల్లడించలేమని తెలిపారు.


More Telugu News