డీకే శివకుమార్‌ను ఢిల్లీకి వెళ్లనీయండి, ఎవరైనా అడ్డు చెప్పారా: సిద్ధరామయ్య

  • ఢిల్లీకి డీకే శివకుమార్, మంగళూరుకు సిద్ధరామయ్య పయనం
  • అధికారిక ఆహ్వానం అందనిదే తాను ఢిల్లీకి వెళ్లనని సిద్ధరామయ్య స్పష్టీకరణ
  • అధిష్ఠానం నుంచి ఆదేశాలు ఉండే కేసీ వేణుగోపాల్ ద్వారా తెలియజేసేవారని వ్యాఖ్య
కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డీకే శివకుమార్ "ఢిల్లీ వెళితే వెళ్లనివ్వండి. ఎవరైనా అడ్డు చెప్పారా?" అని ఆయన అన్నారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై గత కొద్దికాలంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఈ చర్చకు ముగింపు పలకాలని భావించినప్పటికీ, చర్చ మాత్రం ఆగడం లేదు.

ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ మరోసారి ఢిల్లీకి వెళ్లారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. అధికారిక ఆహ్వానం అందిన తర్వాత తాను దేశ రాజధానికి వెళతానని ఆయన స్పష్టం చేశారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా డీకే శివకుమార్ ఓ వివాహానికి హాజరు కావడంతో పాటు పార్టీ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. డీకే శివకుమార్ ఢిల్లీకి పయనమవ్వగా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళూరుకు చేరుకున్నారు. అదే కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రితో కలిసి భోజనం చేశారు. అయితే, ఈ సందర్భంగా తాము రాజకీయాలపై చర్చించలేదని సిద్ధరామయ్య మీడియాకు తెలిపారు.

డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటనపై మీడియా ప్రశ్నించగా, ఆయన వెళితే వెళ్లనీయండని, తనను పిలిచినప్పుడు వెళతానని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. తనను ఆహ్వానించలేదు కాబట్టి వెళ్లలేదని ఆయన అన్నారు. ఢిల్లీలో జరిగే సమావేశానికి సంబంధించి పార్టీ హైకమాండ్ నుంచి ఏమైనా ఆదేశాలు ఉంటే కేసీ వేణుగోపాల్ ద్వారా తెలియజేసేవారని ఆయన పేర్కొన్నారు.


More Telugu News