కోహ్లీ, రోహిత్ 2027 వరల్డ్‌కప్‌లో ఆడకపోతే సంతోషిస్తా: రహ్మనుల్లా గుర్బాజ్

  • వారిద్దరూ లేకపోతే ప్రత్యర్థులకు గెలిచే అవకాశాలు మెరుగవుతాయన్న గుర్బాజ్
  • ఫామ్ కోల్పోయినప్పుడు విరాట్ కోహ్లీ సలహాలు తీసుకుంటానని వెల్లడి
  • ఇటీవల కోహ్లీ సలహాతోనే మరుసటి మ్యాచ్‌లో 90 పరుగులు చేశానన్న ఆఫ్ఘన్ వికెట్‌ కీపర్
టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడకపోతేనే బాగుంటుందని ఆఫ్ఘనిస్థాన్ వికెట్ కీపర్ రహ్మనుల్లా గుర్బాజ్ సరదాగా వ్యాఖ్యానించాడు. వారిద్దరూ జట్టులో లేకపోతే ప్రత్యర్థి జట్లకు గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని, అందుకే ఓ ఆఫ్ఘన్ ఆటగాడిగా తాను సంతోషిస్తానని అన్నాడు. కోహ్లీ, రోహిత్‌లను లెజెండ్స్‌గా అభివర్ణించిన గుర్బాజ్, వారిద్దరూ లేకుండా జట్టును ఊహించడం కష్టమని పేర్కొన్నాడు.

ఐఎల్‌టీ20 టోర్నీ ప్రారంభానికి ముందు 'ఇండియా టుడే'తో ప్రత్యేకంగా మాట్లాడిన గుర్బాజ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా విరాట్, కోహ్లీతో తనకున్న అనుబంధాన్ని బయటపెట్టాడు. "నేను ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నప్పుడు లేదా ఏదైనా సలహా కావాలనుకున్నప్పుడు విరాట్ భాయ్‌కు ఫోన్ చేస్తాను. ఇటీవల నేను సరిగా పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డాను. అప్పుడు ఆయనకు ఫోన్ చేసి మాట్లాడాను. ఆయన సలహా తీసుకున్న మరుసటి మ్యాచ్‌లోనే నేను 90కి పైగా పరుగులు చేశాను" అని వెల్లడించాడు.

కోహ్లీ ఇచ్చే సలహా చాలా సింపుల్‌గా ఉంటుందని గుర్బాజ్ తెలిపాడు. "ఆటను ఎక్కువగా సంక్లిష్టం చేసుకోవద్దు, కష్టపడి ఆడుతూ ఆస్వాదించు అని ఆయన చెబుతారు. గత మూడేళ్లుగా నాకు ఎప్పుడు అవసరమైనా ఆయన అందుబాటులో ఉంటూ సహాయం చేస్తున్నారు" అని కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు.



More Telugu News