వారిని గదిలో పడేసి కొట్టాలన్నంత కోపం ఉండేది: రేవంత్ రెడ్డి

  • ఒకప్పుడు చాలామందిపై కోపం ఉండేదన్న ముఖ్యమంత్రి 
  • రాజకీయాల్లో అడ్డంకులు సహజమని, అధిగమించి వెళ్లాలని సూచన
  • కొత్త డీసీసీ అధ్యక్షులకు 6 నెలల ప్రొబేషన్ పీరియడ్ ప్రతిపాదన
  • కేసీఆర్ పాలనపై విమర్శలు, తమ ప్రభుత్వ అభివృద్ధి పనుల వెల్లడి
  • రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడుతామన్న ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం కాకముందు చాలామందిని గదిలో పడేసి కొట్టాలన్నంత కోపం ఉండేదని, కానీ ముఖ్యమంత్రి అయ్యాక అదంతా వృథా అనిపించిందని అన్నారు. ప్రస్తుతం అవన్నీ మరిచిపోయి రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో నిన్న కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాజకీయాల్లో కాళ్లలో కట్టె పెట్టడం సహజమని, దాన్ని సమస్యగా చూడవద్దని కొత్త డీసీసీ అధ్యక్షులకు సూచించారు. స్వయంగా రాహుల్ గాంధీకే ఈ సమస్య ఉందని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబంపైనే కుట్రలు చేస్తున్నారని గుర్తుచేశారు. కొత్త అధ్యక్షులు నామోషీ పడకుండా సీనియర్ నాయకుల ఇళ్లకు వెళ్లి సహకారం కోరాలని హితవు పలికారు. రకరకాల మనస్తత్వాలను కలుపుకొనిపోయేదే కాంగ్రెస్ పార్టీ అని, అందరినీ సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కొత్త డీసీసీ అధ్యక్షులకు ఆరు నెలల ప్రొబేషనరీ పీరియడ్ పెట్టాలని సీఎం ప్రతిపాదించారు. వారి పనితీరుపై నెల నెలా రిపోర్టులు తీసుకుని, దాని ఆధారంగానే వారిని కొనసాగించాలా వద్దా అని ఏఐసీసీ నిర్ణయిస్తుందని తెలిపారు. ఈ విధానాన్ని గుజరాత్‌లో ఏఐసీసీ ఇప్పటికే ప్రారంభించిందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ తెలిపారు. 


More Telugu News