నాడు విధ్వంసం.. నేడు ప్రగతి పథం: మంత్రి నిమ్మల రామానాయుడు

  • గత ఐదేళ్లలో సాగునీటి రంగాన్ని జగన్ ప్రభుత్వం ధ్వంసం చేసింద‌ని విమ‌ర్శ‌
  • 2027 జులై నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యమ‌న్న మంత్రి
  • ఏడాదిలో హంద్రీనీవా పనులు పూర్తి చేసి రాయలసీమకు నీరందిస్తామ‌న్న నిమ్మ‌ల‌
  • కృష్ణా జలాల వివాదానికి జగన్ అసమర్థతే ప్రధాన కారణమ‌ని మండిపాటు
  • దెబ్బతిన్న ప్రాజెక్టుల మరమ్మతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామ‌ని వెల్ల‌డి
గ‌త వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సాగునీటి రంగం పూర్తిగా ధ్వంసమైందని, సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దానిని తిరిగి ప్రగతి పథంలోకి తెస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

గత ప్రభుత్వంలో ప్రాజెక్టులన్ని ధ్వంసం
జగన్ పాలనలో ప్రాజెక్టులన్నీ నిర్వీర్యమై రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. 2014-19 మధ్య చేపట్టిన పనులను జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ పేరుతో రద్దు చేశారని నిమ్మల దుయ్యబట్టారు. ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 42 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పులిచింతల, గుండ్లకమ్మ వంటి ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఫలితంగా ప్రతి నియోజకవర్గంలో వేల ఎకరాల్లో సాగు దిగుబడి తగ్గి రైతులు వలసబాట పట్టారని అన్నారు.

గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి
గోదావరి పుష్కరాలు జరిగే 2027 జులై నాటికి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. నిర్వాసితులకు ఏడాదిలోనే రూ.1,900 కోట్లు అందించామని, 2026 నాటికి పునరావాస కాలనీలు పూర్తి చేస్తామన్నారు. అదేవిధంగా రూ.3,870 కోట్లతో ఏడాదిలో హంద్రీనీవా పనులను పూర్తి చేసి రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని భరోసా ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టును కూడా 2026 జూన్ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. దెబ్బతిన్న శ్రీశైలం, ధవళేశ్వరం ప్రాజెక్టుల మరమ్మతులకు ఇప్పటికే నిధులు విడుదల చేశామని వివరించారు.

కృష్ణా జలాలపై చర్చకు కారణమే జగన్
కృష్ణా జలాల పంపిణీపై ప్రస్తుతం చర్చ జరగడానికి జగన్ అసమర్థ పాలనే కారణమని నిమ్మల ఆరోపించారు. 2020 అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ కొత్త ప్రతిపాదనలు తెచ్చినప్పుడు జగన్ మౌనంగా ఉండి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని విమర్శించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాష్ట్ర హక్కుల కోసం బలమైన వాదన వినిపిస్తోందని తెలిపారు. చంద్రబాబుపై ఉన్నవన్నీ ఆధారాలు లేని కేసులని, అందుకే కోర్టులు వాటిని కొట్టివేస్తున్నాయని అన్నారు.


More Telugu News