పానీ పూరి తింటుంటే పక్కకు జరిగిన దవడ ఎముక.. వీడియో ఇదిగో!

  • తెరిచిన నోరు తెరిచినట్లే ఉండడంతో ఆసుపత్రికి పరుగులు
  • చాలాసేపు శ్రమించి మహిళ దవడను సరిచేసిన వైద్యులు
  • యూపీలోని ఔరయా జిల్లాలో ఘటన
పానీపూరి తినడానికి వెళ్లిన ఓ మహిళకు ఊహించని భయానక అనుభవం ఎదురైంది. పానీపూరి తింటుండగా దవడ ఎముక పక్కకు జరగడంతో ఆమె నోరు మూయలేక విపరీతమైన బాధతో ఆసుపత్రికి పరుగులు తీసింది. ఉత్తరప్రదేశ్ లోని ఔరయా జిల్లాలో చోటుచేసుకుందీ ఘటన. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..

ఔరయా జిల్లాకు చెందిన ఇంకిలా దేవి మరో మహిళతో కలిసి మార్కెట్ కు వెళుతూ పానీపూరి బండి వద్ద ఆగారు. ఇద్దరూ పానీపూరి తింటుండగా ఇంకిలా దేవి దవడ ఎముక పక్కకు జరిగింది. పెద్ద పానీ పూరిని నోట్లో పెట్టుకునేందుకు తెరిచిన నోరు ఆ తర్వాత మూతపడలేదు. తెరిచిన నోరు తెరిచినట్లే ఉండడంతో ఇంకిలా దేవి తీవ్ర అవస్థపడింది. 

నొప్పితో తల్లడిల్లుతున్న ఇంకిలా దేవిని వెంటనే పక్కనే ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అక్కడి వైద్యుడు కొంతసేపు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. దవడ పక్కకు జరగడంతో చాలా సెన్సిటివ్ గా మారిందని చెప్పి మరో ఆసుపత్రికి రిఫర్ చేశారు. దీంతో ఇంకిలా దేవిని పెద్దాసుపత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు చాలాసేపు శ్రమించి ఆమె దవడను సరిచేశారు.


More Telugu News