స్కూల్‌లోనే చిన్నారికి నరకం.. జుట్టుపట్టి నేలకేసి బాదిన ఆయా.. వీడియో ఇదిగో!

  • హైదరాబాద్‌లోని ఓ పాఠశాలలో నర్సరీ చిన్నారిపై ఆయా దాడి
  • జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టి, కాలితో తొక్కిన వైనం
  • సెల్‌ఫోన్ వీడియోతో వెలుగులోకి వచ్చిన అమానుష ఘటన
  • ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ఆయాపై హత్యాయత్నం కేసు నమోదు
  • అదే పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్న బాధితురాలి తల్లి
హైదరాబాద్‌లోని షాపూర్‌ నగర్‌లో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. నర్సరీ చదువుతున్న ఐదేళ్ల చిన్నారిపై పాఠశాల ఆయా అత్యంత పాశవికంగా దాడి చేసింది. ఈ దారుణాన్ని కొందరు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితురాలిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశాకు చెందిన సంతోషి, కలియా దంపతులు తమ ఐదేళ్ల కుమార్తె ధరిత్రితో కలిసి కొన్ని నెలల క్రితం నగరానికి వలస వచ్చారు. షాపూర్‌‌నగర్‌లోని పూర్ణిమా స్కూల్‌లో సంతోషి ఆయాగా పనిచేస్తుండగా, కుమార్తె ధరిత్రి అదే స్కూల్‌లో నర్సరీ చదువుతోంది. అదే పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్న లక్ష్మమ్మ, తల్లిలేని సమయంలో చిన్నారిని కొన్నాళ్లుగా హింసిస్తోంది.

శనివారం సాయంత్రం లక్ష్మమ్మ మరోసారి చిన్నారిపై విరుచుకుపడింది. జుట్టు పట్టుకుని తలను నేలకేసి బాదడమే కాకుండా, కిందపడేసి కాలితో తొక్కింది. ఈ ఘటనను పాఠశాల పక్కన ఉన్న ఓ బాలుడు వీడియో తీసి చిన్నారి తల్లిదండ్రులకు ఇచ్చాడు. వారు పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో ఆదివారం జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించారు.

వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితురాలు లక్ష్మమ్మను అరెస్ట్ చేశారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితురాలిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


More Telugu News