దిత్వా తుపాను ముప్పు... టెలికాం శాఖ ప్రత్యేక చర్యలు

  • బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను
  • ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు హెచ్చరిక
  • తుపాను వేళ టెలికాం సేవలపై కేంద్రం ప్రత్యేక దృష్టి
  • తమిళనాడులో ఇప్పటికే ముగ్గురు మృతి, పంటలకు నష్టం
  • ఏపీలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
బంగాళాఖాతంలో ఏర్పడిన 'దిత్వా' తుపాను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాల వైపు దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర టెలికాం శాఖ ముందస్తుగా అప్రమత్తమైంది. తుఫాను సమయంలో టెలికాం నెట్‌వర్క్‌లకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 24×7 పనిచేసేలా ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో సమన్వయం చేసుకుంటూ, జిల్లా యంత్రాంగాలు, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలకు తక్షణ సమాచారం అందించనుంది.

అన్ని టెలికాం కంపెనీలు తమ సేవలను నిరంతరాయంగా కొనసాగించాలని, జనరేటర్లకు అవసరమైన ఇంధనాన్ని, అత్యవసర పవర్ బ్యాకప్‌లను సిద్ధంగా ఉంచుకోవాలని డాట్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ప్రభావితమయ్యే జిల్లాల్లో సహాయక బృందాలను మోహరించాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో కమ్యూనికేషన్ కొనసాగేలా అన్ని నెట్‌వర్క్‌లలో ఇంట్రా సర్కిల్ రోమింగ్, సెల్ బ్రాడ్‌కాస్ట్ సేవలను కూడా పరీక్షించినట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.

ఇప్పటికే ఈ తుపాను ప్రభావంతో తమిళనాడులో వర్ష సంబంధిత ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. డెల్టా జిల్లాల్లో సుమారు 149 పశువులు మృత్యువాత పడగా, 57,000 హెక్టార్ల వ్యవసాయ భూమి దెబ్బతింది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరిక జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల కోసం క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉన్నాయి.


More Telugu News