హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వందే భారత్ రైల్లో ప్రయాణించిన కేంద్రమంత్రి

  • వరంగల్ రైల్వే స్టేషన్‌లో చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించిన కిషన్ రెడ్డి
  • భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి
  • వరంగల్ విమానాశ్రయ పనులు వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నుండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించి వరంగల్ చేరుకున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అనంతరం రైల్వే స్టేషన్ క్యాంటీన్‌లో 'చాయ్ పే' చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. వరంగల్ నగరంలోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.

నగరంలో పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించిన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వరంగల్ విమానాశ్రయ పనులను వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఇక్కడి నుండి తొలుత ఏటీఆర్ విమానాలు నడపాలని భావిస్తున్నామని, తర్వాత స్పందనను బట్టి మరిన్ని సర్వీసులు నడుపుతామని అన్నారు.

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని కేంద్ర మంత్రి అన్నారు. అమృత్ పథకం కింద వరంగల్ జిల్లాకు రూ.874 కోట్లు మంజూరైనట్లు ఆయన వెల్లడించారు. కాజీపేట రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పామని అన్నారు. హృదయ్ పథకం కింద పురాతన ఆలయాల పునరద్ధరణకు కేంద్రం నిధులు ఇచ్చిందని, ఇందులో భాగంగా రామప్ప ఆలయ అభివృద్ధి కోసం కేంద్రం రూ.146 కోట్లు ఖర్చు చేస్తోందని ఆయన అన్నారు.


More Telugu News