కర్ణాటక రాజకీయం.. బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ పూర్తయ్యాక ఎవరేమన్నారంటే..!

  • రేపటి నుంచి ఎలాంటి గందరగోళం ఉండదు: సీఎం సిద్ధరామయ్య
  • మేమిద్దరం కలిసి పనిచేస్తాం: డిప్యూటీ సీఎం డీకే
  • 2028 అసెంబ్లీ ఎన్నికలపై చర్చించామని వెల్లడి
  • తామిద్దరం పార్టీకి నమ్మకమైన సేవకులమని వివరణ
కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి విషయంలో నెలకొన్న సందిగ్దాలు, విభేదాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరిగింది. ఈ రోజు ఉదయం జరిగిన ఈ సమావేశం తర్వాత ఇరువురు నేతలు ఉమ్మడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

సిద్ధరామయ్య మాట్లాడుతూ..
రేపటి నుంచి రాష్ట్రంలో ఎలాంటి గందరగోళం ఉండదని చెప్పారు. పార్టీ కోసం కలిసి పనిచేస్తామని ఆయన వివరించారు. పార్టీలో నేతలంతా ఐకమత్యంతో ఉన్నారని, ఇకపైనా ఇదే ఐకమత్యం కొనసాగుతుందని చెప్పారు.

డీకే శివకుమార్ మాట్లాడుతూ..
సీఎం సిద్ధరామయ్యకు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. తామిద్దరం కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి తాము నమ్మకమైన సేవకులమని చెప్పారు. పార్టీ ఆదేశిస్తే ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధమని తెలిపారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపై, 2028లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడంపై చర్చించామన్నారు.

తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, పార్టీలోనూ ఎలాంటి కూటములు లేవని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చడంపైనే తాము దృష్టి సారించామని, ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలను ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించామని డీకే శివకుమార్ చెప్పారు.


More Telugu News