కేదార్‌నాథ్ హెలికాప్టర్ ప్రమాదం.. వెలుగులోకి పైలట్ చివరి సందేశం

  • ప్రమాదంలో పైలట్‌ సహా ఏడుగురి దుర్మరణం
  • వాతావరణ సమాచార లోపమే ప్రమాదానికి కారణమని ఏఏఐబీ నివేదిక వెల్లడి
  • ప్రమాదం తర్వాత కేదార్‌నాథ్ హెలికాప్టర్ సర్వీసులకు డీజీసీఏ కొత్త నిబంధనలు
‘‘ముందు ఏమీ కనిపించడం లేదు.. వెనక్కి తిరుగుతున్నాను’’ ఈ ఏడాది జూన్ 15న కేదార్‌నాథ్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదానికి ముందు పైలట్ నుంచి వచ్చిన చివరి రేడియో సందేశం ఇది. ఈ మాటలు చెప్పిన కొన్ని క్షణాల్లోనే ఆర్యన్ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్ గౌరీకుండ్ వద్ద పర్వతాన్ని ఢీకొని కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పైలట్‌ సహా ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) విడుదల చేసిన మధ్యంతర నివేదిక ఈ విషాదకర వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది.

జైపూర్‌కు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఏవియేటర్, కెప్టెన్ రాజ్‌వీర్ సింగ్ చౌహాన్ నడుపుతున్న బెల్ 407 హెలికాప్టర్ (VT-BKA) ఆ రోజు ఉదయం 5:10 గంటలకు గుప్తకాశీ నుంచి కేదార్‌నాథ్‌కు బయలుదేరింది. ప్రయాణికులను దించిన తర్వాత, ఆరుగురు యాత్రికులతో తిరుగు ప్రయాణమైంది. లోయ నుంచి బయటకు వస్తున్న సమయంలో దట్టమైన మేఘాలు అడ్డుకోవడంతో పైలట్ ‘మార్గం మూసుకుపోయింది’ అని కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని క్షణాలకే ‘ఏమీ కనిపించడం లేదు, టర్న్ అవుతున్నాను’ అని చివరి సందేశం పంపారు. ఆ తర్వాత హెలికాప్టర్‌తో సంబంధాలు తెగిపోయాయి.

ఆ సమయంలో ప్రమాదానికి గురైన హెలికాప్టర్ వెనుకే వస్తున్న మరో రెండు హెలికాప్టర్ల పైలట్లు ఈ సందేశాన్ని విన్నారు. వారు వెంటనే అప్రమత్తమై, తక్కువ ఎత్తులో ప్రయాణించి సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో లోయ నుంచి బయటకు వచ్చే మార్గాన్ని మేఘాలు కమ్మేసినట్లు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా నమోదైంది.

వాతావరణ పర్యవేక్షణలో తీవ్ర లోపాలు
కేదార్‌నాథ్ హెలిప్యాడ్ వద్ద ఆటోమేటెడ్ వెదర్ ఇన్‌స్ట్రుమెంట్ ఉన్నప్పటికీ, అది మేఘాల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని అందించదని, డేటాను రికార్డ్ చేయదని ఏఏఐబీ నివేదిక తేల్చిచెప్పింది. పైలట్లు కేవలం సీసీటీవీ కెమెరాల ద్వారా వాతావరణాన్ని అంచనా వేసుకోవాల్సి వస్తోందని పేర్కొంది. ఈ ప్రమాదం తర్వాత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మేల్కొని, కేదార్‌నాథ్ షటిల్ సర్వీసులకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా వాతావరణ పర్యవేక్షణకు ప్రత్యేక కంట్రోల్ సెంటర్‌తో పాటు, వాతావరణ శాఖ (ఐఎండీ) సిబ్బందిని తప్పనిసరి చేసింది. ఈ ఘటనపై ఏఏఐబీ తుది నివేదిక రావాల్సి ఉంది.


More Telugu News