విమాన కంట్రోల్స్‌పై సౌర రేడియేషన్ దెబ్బ.. ఇండిగో, ఎయిరిండియా సర్వీసులకు అంతరాయం

  • A320 ఫ్యామిలీ విమానాల్లో సాంకేతిక సమస్య గుర్తింపు
  • సౌర రేడియేషన్ వల్ల ఫ్లైట్ కంట్రోల్ డేటాలో లోపం
  • దేశవ్యాప్తంగా 200-250 విమానాలపై తీవ్ర ప్రభావం
  • సాఫ్ట్‌వేర్ మార్పుల కోసం విమానాలు తాత్కాలికంగా నిలిపివేత
దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థలు ఇండిగో, ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు తీవ్ర అంతరాయం కలగనుంది. ఈ సంస్థలు వినియోగిస్తున్న ఎయిర్‌బస్ A320 ఫ్యామిలీ విమానాల్లోని ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్‌లో ఒక సంభావ్య సమస్యను గుర్తించడంతో, దానిని సరిదిద్దేందుకు దేశవ్యాప్తంగా దాదాపు 200 నుంచి 250 విమానాలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు.

తీవ్రమైన సౌర రేడియేషన్ కారణంగా A320 విమానాల్లోని కీలకమైన ఫ్లైట్ కంట్రోల్ డేటా దెబ్బతినే ప్రమాదం ఉందని విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ శుక్రవారం వెల్లడించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి సాఫ్ట్‌వేర్ మార్పులు లేదా హార్డ్‌వేర్ అమరిక అవసరమని, దీనివల్ల విమాన సర్వీసులపై ప్రభావం పడుతుందని తెలిపింది. దేశంలో ఈ కేటగిరీకి చెందిన సుమారు 560 విమానాలు ఉండగా, వాటిలో 250 వరకు విమానాలకు ఈ మార్పులు అవసరమని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ సమస్య ఉన్న విమానాల్లోని ఎలివేటర్ ఐలరాన్ కంప్యూటర్‌ను వెంటనే మార్చాలని లేదా సరిచేయాలని యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి విమానం తదుపరి సర్వీసు ప్రారంభించేలోపే ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఈ విషయంపై ఇండిగో స్పందించింది. ఎయిర్‌బస్ సూచనల మేరకు అవసరమైన తనిఖీలు చేపడుతున్నామని, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. తమ ఫ్లీట్‌లోని కొన్ని విమానాల్లో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ మార్పులు చేయాల్సి ఉందని, దీనివల్ల సర్వీసులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కూడా ధ్రువీకరించాయి. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 31 విమానాలపై ఈ ప్రభావం పడనుంది. ప్రయాణికుల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని, ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్‌బస్ ఒక ప్రకటనలో పేర్కొంది.


More Telugu News