సౌరవ్ గంగూలీ అర్ధాంగికి ఆన్‌లైన్ వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు

  • సోషల్ మీడియా వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన డోనా గంగూలీ
  • భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అర్ధాంగిని లక్ష్యంగా చేసుకుని పోస్టులు
  • ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శన తర్వాత పెరిగిన అసభ్యకర వ్యాఖ్యలు
  • ఫేస్‌బుక్ పేజీ వివరాలతో ఫిర్యాదు.. పోలీసుల దర్యాప్తు
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అర్ధాంగి, ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి డోనా గంగూలీ సోషల్ మీడియాలో వేధింపులకు గురయ్యారు. తనపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అసభ్యకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.

అస‌లేం జ‌రిగిందంటే..!
ఇటీవల జరిగిన కోల్‌కతా ఫిల్మ్ ఫెస్టివల్‌లో డోనా గంగూలీ నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత ఒక ఫేస్‌బుక్ పేజీలో ఆమెను లక్ష్యంగా చేసుకుని అనుచిత పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. తనను బాడీ షేమింగ్ చేయడంతో పాటు తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టారని డోనా ఆరోపించారు.

ఈ నేప‌థ్యంలో ఆమె ఠాకూర్‌పుకుర్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదుకు మద్దతుగా ఆ పోస్టులకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను, ఫేస్‌బుక్ పేజీతో సంబంధం ఉన్న ఒక మొబైల్ నంబర్‌ను కూడా ఆమె పోలీసులకు అందించారు. ఈ ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, పోస్టులు పెట్టిన వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.




More Telugu News