అంతటి బలహీనమైన నాయకుడిని కాదు: జగ్గారెడ్డి

  • ఓడిపోయినంత మాత్రాన చిన్నబుచ్చుకునే వ్యక్తిని కాదని వ్యాఖ్య
  • బీజేపీ ఎంపీ లక్ష్మణ్ రాహుల్ గాంధీ గురించి మాట్లాడటం సరికాదన్న జగ్గారెడ్డి
  • దేశంలో కాంగ్రెస్ ఎంతో అభివృద్ధి చేసిందన్న జగ్గారెడ్డి
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనంత మాత్రాన తాను కుంగిపోయే వ్యక్తిని కాదని, అంత బలహీనమైన నాయకుడిని కాదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాల్లో అన్ని ప్రశ్నలకు ఒకేసారి సమాధానం ఉండదని ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ఆయన బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించడం సరికాదని ఆయన అన్నారు. లక్ష్మణ్ వయస్సు 69 ఏళ్లని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు అవుతోందని, అప్పటికింకా లక్ష్మణ్ పుట్టలేదని అన్నారు. అలాంటి లక్ష్మణ్ తమ పార్టీ నాయకుడి గురించి మాట్లాడటం సముచితం కాదని అన్నారు.

దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని అభివృద్ధి చేశామని, ఎఫ్‌సీఐని ఏర్పాటు చేశామని, పెత్తందారీ భూములను పేదలకు పంచామని, బ్యాంకులను పల్లెలకు తెచ్చామని, బాలానగర్ బీడీఎల్ వంటి కంపెనీలు తెచ్చామని ఆయన అన్నారు. మోదీ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు అవుతోందని, వారు ఏం కంపెనీలు ప్రారంభించారో చెప్పాలని నిలదీశారు.

18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించింది రాజీవ్ గాంధీ అని ఆయన గుర్తు చేశారు. దేశంలో ఐటీ అభివృద్ధికి రాజీవ్ గాంధీ ఆలోచనలే కారణమని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్న అభివృద్ధి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉందా అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ దొంగ ఓట్లతో గెలుస్తూ వస్తోందని విమర్శించారు.


More Telugu News