జగన్‌కు మంచి పేరు వస్తుందనే కుట్ర ఇది: బొత్స విమర్శలు

  • ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారని బొత్స ఆరోపణ
  • పీపీపీ విధానంతో పేద ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందన్న ఎమ్మెల్సీ
  • ప్రజల నుంచి సంతకాలు సేకరించి గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని వెల్లడి
  • జగన్‌కు పేరు రాకూడదనే దుర్భుద్దితోనే ఈ నిర్ణయమని విమర్శ
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తోందని, ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర పన్నుతోందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఆరోపించారు. ప్రభుత్వ విధానాల వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు.

ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానం పేరుతో ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బొత్స స్పష్టం చేశారు. "ప్రజారోగ్యం ప్రభుత్వ చేతుల్లోనే ఉండాలి. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే పేదలకు అన్యాయం జరుగుతుంది. ఈ ప్రైవేటీకరణ ద్వారా లబ్ధి పొందాలనే చంద్రబాబు దుర్బుద్ధి బయటపడుతోంది" అని ఆయన విమర్శించారు.

ఈ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి సంతకాల రూపంలో అభిప్రాయాలు సేకరిస్తామని తెలిపారు. అనంతరం వైఎస్ జగన్ నేతృత్వంలో వాటిని రాష్ట్ర గవర్నర్‌కు అందజేస్తామని వెల్లడించారు. ఇందుకోసం గురువారమే గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరినట్లు చెప్పారు.

గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను మంజూరు చేసిందని బొత్స గుర్తు చేశారు. వీటిలో 5 కళాశాలలు పూర్తికాగా, 12 నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. జగన్‌కు మంచి పేరు వస్తుందనే దుగ్ధతోనే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు వాటిని ప్రైవేటుపరం చేసేందుకు పీపీపీ మోడల్‌ను తెరపైకి తెచ్చిందని బొత్స ఆరోపించారు.


More Telugu News