హైదరాబాదీ బిర్యానీకి ప్రపంచ ఖ్యాతి.. టాప్‌ 10లో చోటు!

  • ప్రపంచ ఉత్తమ రైస్‌ డిష్‌ల జాబితాలో హైదరాబాదీ బిర్యానీ
  • టేస్ట్ అట్లాస్ ర్యాంకింగ్స్‌లో 10వ స్థానం
  • టాప్ 50లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ వంటకం
  • జాబితాలో అధికంగా జపనీస్ వంటకాలదే ఆధిపత్యం
హైదరాబాదీ బిర్యానీ రుచి మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ గైడ్ 'టేస్ట్ అట్లాస్' విడుదల చేసిన 'వరల్డ్స్‌ బెస్ట్‌ రైస్‌ డిషెస్‌ లిస్ట్‌ ఆఫ్‌ 2025'లో మన బిర్యానీ టాప్ 10లో సగర్వంగా నిలిచింది. ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో 10వ స్థానాన్ని దక్కించుకుంది. అలాగే టాప్ 50లో చోటు సంపాదించిన ఏకైక భారతీయ వంటకం కూడా ఇదే కావడం గమనార్హం.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ చెఫ్‌లు, ఫుడ్ క్రిటిక్స్‌ సమీక్షలు, పర్యాటకులు ఇచ్చిన రేటింగ్స్ ఆధారంగా టేస్ట్ అట్లాస్ ఈ ర్యాంకింగ్‌ను ఖరారు చేసింది. భారత్‌లో లక్నో, కశ్మీరీ, కోల్‌కతా వంటి ఎన్నో ప్రసిద్ధ బిర్యానీలు ఉన్నప్పటికీ, వాటన్నింటినీ వెనక్కి నెట్టి హైదరాబాదీ బిర్యానీ అగ్రగామిగా నిలిచింది.

ఈ జాబితాలో జపనీస్ వంటకాలదే ఆధిపత్యం కొనసాగింది. తొలి మూడు స్థానాల్లో నెగిటోరోడాన్‌, సుషీ, కైసెన్డాన్‌ వంటి జపనీస్ వంటకాలు నిలిచాయి. ఇదే జాబితాలో ఇరాన్‌కు చెందిన మరో బిర్యానీ వంటకం కూడా స్థానం సంపాదించడం మరో ఆసక్తికరమైన విషయం. ఏదేమైనా అంతర్జాతీయ వేదికపై హైదరాబాదీ బిర్యానీ తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది.




More Telugu News