ధోనీ ఇంట్లో సందడి చేసిన టీమిండియా ప్లేయ‌ర్లు.. వన్డే సిరీస్‌కు ముందు కొత్త జోష్!

  • ద‌క్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ముందు ధోనీ ఇంటికి భారత జట్టు
  • జట్టుతో చేరిన సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ
  • టెస్టు సిరీస్‌లో విఫలమైన రిషభ్ పంత్‌పై అందరి దృష్టి
  • వన్డే జట్టులోకి పునరాగమనం చేసిన రుతురాజ్ గైక్వాడ్
  • ఎల్లుండి రాంచీలో జరగనున్న తొలి వన్డే మ్యాచ్
ద‌క్షిణాఫ్రికాతో కీలకమైన వన్డే సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టు రాంచీలో సందడి చేస్తోంది. ఇక్కడికి వచ్చిన ఆటగాళ్లు, ఎప్పటిలాగే తమ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నివాసానికి చేరుకుని ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, రిష‌భ్ పంత్‌, రుతురాజ్ గైక్వాడ్ త‌దిత‌ర ఆట‌గాళ్లు ఎంఎస్‌డీ ఇంట్లో సంద‌డి చేశారు.  టెస్టు సిరీస్‌లో ఎదురైన పరాజయం నుంచి తేరుకుని, కొత్త ఫార్మాట్‌లో సరికొత్త ఉత్సాహంతో బరిలోకి దిగేందుకు ఈ భేటీ దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

టెస్టు సిరీస్ ఓటమి తర్వాత, కోహ్లీతో పాటు రోహిత్ శర్మ వంటి సీనియర్ల అనుభవం జట్టుకు ఎంతో కీలకం కానుంది. రాంచీలోని జేఎస్‌సీఏ అంతర్జాతీయ స్టేడియంలో ఈ నెల‌ 30న తొలి వన్డే జరగనుంది. 

ఇక‌, అందరి దృష్టి మాత్రం వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌పైనే ఉంది. టెస్టు సిరీస్‌లో తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్, నాలుగు ఇన్నింగ్స్‌లలో కేవలం 49 పరుగులే చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. జట్టు ప్రదర్శనపై అభిమానులకు బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పాడు. ఇప్పుడు వన్డే సిరీస్‌లో తన ఫామ్ నిరూపించుకోవడానికి అతనికి ఇది మంచి అవకాశం.

వీరితో పాటు దేశవాళీ క్రికెట్‌లో రాణించిన యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ కూడా జట్టుతో కలిశాడు. అతని రాకతో జట్టు బ్యాటింగ్ లైనప్‌కు మరింత బలం చేకూరింది. మొత్తం మీద రాంచీలో ఆటగాళ్ల కలయిక జట్టులో ఒక సానుకూల వాతావరణాన్ని నింపింది. సీనియర్ల పునరాగమనం, నిరూపించుకోవాలనే కసితో ఉన్న యువ ఆటగాళ్లతో భారత జట్టు వన్డే సిరీస్‌ను విజయంతో ప్రారంభించాలని పట్టుదలగా ఉంది.




More Telugu News