డిస్కంలను నట్టేట ముంచారు.. బీఆర్ఎస్ పై మంత్రి తుమ్మల ఫైర్

  • అధిక ధరకు విద్యుత్ కొని డిస్కంల నెత్తిన 90 వేల కోట్ల అప్పు రుద్దారని ఆరోపణ
  • ప్రజలు బుద్ది చెప్పడంతో బీఆర్ఎస్ నేతల మైండ్ పనిచేయడం లేదని ఎద్దేవా
  • బావాబామ్మర్దులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శ
తెలంగాణ డిస్కంలను నట్టేట ముంచిందే గత బీఆర్ఎస్ సర్కార్ అని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆరోపించారు. గత ప్రభుత్వ అడ్డగోలు నిర్ణయాలు, ఛత్తీస్ గఢ్ నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు, అవినీతి కారణంగా డిస్కంలు రూ.90 వేల కోట్ల అప్పుల్లో మునిగాయని చెప్పారు. విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించిన నాటి బీఆర్ఎస్ మంత్రులు ఇప్పుడు నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తుమ్మల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలను గ్రహించిన ప్రజలు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బుద్ది చెప్పారని తెలిపారు.

అయినాసరే బావాబామ్మర్దులు మాత్రం ప్రజలను ఇంకా మభ్య పెట్టాలని చూస్తున్నారని హరీశ్ రావు, కేటీఆర్ లను ఉద్దేశించి విమర్శించారు. తొలుత అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో, ఆపై కంటోన్మెంట్ ఎన్నికల్లో, ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో.. బీఆర్ఎస్ అవినీతిపై ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ప్రజాతీర్పుతో హరీశ్, కేటీఆర్ ల మైండ్ పనిచేయడం లేదని, ఏం మాట్లాడాలో అర్థంగాక విద్యుత్ ప్లాంట్లలో అవినీతి అంటూ నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

మూసీని గోదావరి నీళ్లతో నింపుతామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తే.. లక్ష కోట్ల అవినీతి అంటూ కేటీఆర్ ఆరోపిస్తున్నారని, ఇండస్ట్రియల్ జోన్ లోని భూముల కన్వర్షన్ విషయంలో రూ.5 లక్షల కుంభకోణం అని.. నోటికి వచ్చిన లెక్కలతో ఎలాంటి ఆధారం లేకుండా విమర్శిస్తున్నారని మంత్రి తుమ్మల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణల విషయంలో కేటీఆర్ కన్నా తానేమీ తక్కువ కాదని నిరూపించుకునేందుకు హరీశ్ రావు ప్రయత్నిస్తున్నారని తుమ్మల ఎద్దేవా చేశారు. రూ.50 వేల కోట్ల కుంభకోణం జరిగిందంటూ హరీశ్ అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు విమర్శించారు.


More Telugu News