విశాఖలో తీవ్ర విషాదం: కూతురి పెళ్లి ఆగిపోయిందని తండ్రి ఆత్మహత్య

  • విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
  • కుమార్తె వివాహం ఆగిపోవడంతో తీవ్ర మనస్తాపం
  • వరుడి కుటుంబ సభ్యులను వేడుకున్నా ఫలితం శూన్యం
  • కారులో పురుగుల మందు తాగి బలవన్మరణం
  • వాట్సాప్‌లో బంధువులకు సూసైడ్ నోట్ పంపిన మృతుడు
కన్న కూతురి పెళ్లి ఆగిపోయిందన్న మనస్తాపంతో ఓ తండ్రి తనువు చాలించిన హృదయ విదారక ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. వివాహం అర్ధాంతరంగా రద్దు కావడంతో తీవ్ర ఆవేదనకు గురైన రియల్ ఎస్టేట్ వ్యాపారి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ర్యాలి శ్రీనివాసరావు (57) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. ఆయన భార్య, పిల్లలు హైదరాబాద్‌లో ఉండగా, శ్రీనివాసరావు తన తల్లి సత్యవతితో కలిసి విశాఖ పీఎం పాలెంలో నివసిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న తన కుమార్తెకు, పెందుర్తి సమీపంలోని చినముషిడివాడకు చెందిన బ్యాంకు ఉద్యోగితో ఈ ఏడాది మార్చిలో వివాహం నిశ్చయించారు.

నవంబర్ 25న పెళ్లి ముహూర్తం ఖరారు చేసి, బంధుమిత్రులకు శుభలేఖలు పంచి, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, పెళ్లికి కొద్ది సమయం ముందు వరుడి కుటుంబం ఈ వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లు శ్రీనివాసరావుకు తెలియజేశారు. దీంతో ఆందోళనకు గురైన ఆయన, వరుడి ఇంటికి వెళ్లి పెళ్లి ఆపవద్దని కాళ్లావేళ్లా పడి బతిమాలారు. అయినా వారు తమ నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

మంగళవారం రాత్రి విజయనగరంలో పెళ్లికి వెళ్తున్నానని తల్లికి చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన శ్రీనివాసరావు, తిరిగి రాలేదు. బుధవారం ఉదయం పీఎం పాలెం క్రికెట్ స్టేడియం సమీపంలోని సర్వీస్ రోడ్డులో ఆయన కారు ఆగి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. కారులో శ్రీనివాసరావు మృతదేహంతో పాటు పురుగుల మందు డబ్బాను కనుగొన్నారు. ఆత్మహత్యకు ముందు ఆయన తన కుమారుడికి, ఇతర బంధువులకు వాట్సాప్‌లో సూసైడ్ నోట్ పంపినట్లు తెలిసింది. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News