ఘోర పరాజయం... కోచింగ్ భవితవ్యంపై గంభీర్ కీలక వ్యాఖ్యలు

  • దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా క్లీన్‌స్వీప్
  • 25 ఏళ్ల తర్వాత భారత్‌లో సఫారీల టెస్ట్ సిరీస్ విజయం
  • కోచ్‌గా తన భవిష్యత్తుపై బీసీసీఐదే నిర్ణయమన్న గంభీర్
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 408 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమితో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయి సఫారీల చేతిలో క్లీన్‌స్వీప్‌కు గురైంది. సుమారు 25 సంవత్సరాల తర్వాత దక్షిణాఫ్రికా జట్టు భారత గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

మ్యాచ్ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, కోచ్‌గా తన భవిష్యత్తుపై బీసీసీఐనే నిర్ణయం తీసుకుంటుందని గంభీర్ స్పష్టం చేశారు. "కోచ్‌గా మీ భవిష్యత్తు ఏంటి?" అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. "ఆ విషయమై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ దేశమే ప్రధానం, నేను కాదు" అని అన్నారు. ఇదే జట్టు తన కోచింగ్‌లో ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్‌ను సమం చేయడంతో పాటు, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్‌లను గెలిచిందని ఆయన గుర్తుచేశారు.

టెస్టుల్లో వైఫల్యంపై ఏ ఒక్కరినీ నిందించలేమని, ఓటమికి జట్టు మొత్తం సమష్టి బాధ్యత వహించాల్సి ఉంటుందని గంభీర్ పేర్కొన్నారు. సుదీర్ఘ ఫార్మాట్‌లో రాణించాలంటే సమష్టి కృషి ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.


More Telugu News