కర్ణాటక కాంగ్రెస్‌లో కీలక పరిణామం.. డీకేఎస్‌తో జార్కిహోళి అర్ధరాత్రి రహస్య భేటీ!

  • కర్ణాటక కాంగ్రెస్‌లో ముదురుతున్న నాయకత్వ పోరు
  • అర్ధరాత్రి రహస్యంగా భేటీ అయిన డీకేఎస్, సతీశ్ జార్కిహోళి
  • సీఎం పదవి కోసం ఢిల్లీలో డీకే శివకుమార్ వర్గం లాబీయింగ్
  • రేసులో తాను కూడా ఉన్నానంటున్న హోంమంత్రి పరమేశ్వర
  • సీఎం మార్పుపై అధిష్ఠానమే నిర్ణయిస్తుందన్న ఖర్గే
కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి మార్పుపై ఊహాగానాలు జోరందుకున్న వేళ, కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, సీనియర్ మంత్రి సతీశ్ జార్కిహోళితో మంగళవారం అర్ధరాత్రి రహస్యంగా సమావేశమయ్యారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సీఎం సిద్ధరామయ్య రాజకీయ వారసుడిగా, 'అహింద' (మైనారిటీలు, వెనుకబడిన వర్గాలు, దళితులు) ఓటు బ్యాంకుకు బలమైన నేతగా భావిస్తున్న జార్కిహోళితో డీకేఎస్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సిద్ధరామయ్య తర్వాత పార్టీని నడిపించే వ్యూహాలపై, తమ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడంపై వీరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. గతంలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కూడా, తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని జార్కిహోళి ముందుకు తీసుకెళ్లగలరని వ్యాఖ్యానించారు.

ఒకవైపు ఈ సమావేశం జరగ్గా, మరోవైపు డీకే శివకుమార్ మద్దతుదారులు ఢిల్లీలో లాబీయింగ్ ముమ్మరం చేశారు. సుమారు 10 మంది ఎమ్మెల్యేలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి, డీకేఎస్‌ను త్వరలో ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. డీకేఎస్ 200 శాతం సీఎం అవుతారని రామనగర ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, సీఎం రేసులో తాను కూడా ఉన్నానని హోంమంత్రి జి.పరమేశ్వర సంకేతాలిచ్చారు. ఇటీవల జార్కిహోళి నివాసంలో దళిత నేతలతో కలిసి విందులో పాల్గొన్నామని, అక్కడ రాజకీయాలు కూడా చర్చించామని ఆయన తెలిపారు. ఈ పరిణామాలపై సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ.. ఇదంతా అనవసర చర్చ అని కొట్టిపారేశారు. అయితే, సీఎం మార్పుపై అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే స్పష్టం చేశారు.


More Telugu News