కూటమివి పంచ సూత్రాలు కాదు, పంచ మోసాలు: ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్

  • 17 నెలలుగా వ్యవసాయాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందన్న వైఎస్ షర్మిల 
  • పంట నష్టపరిహారం, మద్దతు ధర కల్పించడంలో సర్కార్ విఫలమైందని విమర్శ 
  • ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయలేదని ఫైర్  
కూటమి ప్రభుత్వం రైతుల కోసం ప్రకటించిన ‘పంచ సూత్రాలు’ నిజానికి ‘పంచ మోసాలు’ అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం రైతు సంక్షేమం పేరుతో పచ్చి బూటకాలు ఆడుతోందని ఆమె ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.

గడిచిన 17 నెలలుగా రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని షర్మిల మండిపడ్డారు. "సాగుకు సమాధి కట్టి, ఇప్పుడు అన్నదాతల మేలు కోసం పంచసూత్ర ప్రణాళిక అనడానికి, ప్రచారం చేసుకోవడానికి కూటమి ప్రభుత్వానికి సిగ్గుండాలి" అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం చేసిన ఐదు మోసాలను ఆమె తన ప్రకటనలో ప్రస్తావించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించకుండా ఎగ్గొట్టారని, పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద సగం మంది రైతులకు మొండిచెయ్యి చూపారని విమర్శించారు. అరటి, టమాటా, ఉల్లి ధరలు రూపాయికి పడిపోయినా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయలేదని, చివరికి నాణ్యమైన ఎరువులు, విత్తనాలు కూడా అందించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేశారని షర్మిల ధ్వజమెత్తారు. 


More Telugu News