జలమండలి నీటితో కారు కడిగిన వ్యక్తి... రూ.10 వేల జరిమానా విధించిన అధికారులు

  • హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఘటన
  • కారు కడుగుతుండగా చూసిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి
  • మంచి నీటితో కారు కడగడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎండీ
హైదరాబాద్ జలమండలి (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ) సరఫరా చేసే తాగునీటితో కారును శుభ్రం చేసినందుకు ఒక వ్యక్తికి అధికారులు రూ.10 వేల జరిమానా విధించారు. ఈ సంఘటన నగరంలోని బంజారాహిల్స్ పరిధిలో చోటు చేసుకుంది. రోడ్డు నెంబర్ 12లో ఒక వ్యక్తి జలమండలి సరఫరా చేసే నీటితో తన కారును కడుగుతుండగా, అదే సమయంలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అటుగా వెళుతున్నారు.

నీటితో కారును కడగడం చూసిన ఎండీ, తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా చేయవద్దని హెచ్చరించారు. అంతేకాకుండా, ఆ వ్యక్తికి నోటీసు ఇచ్చి జరిమానా విధించాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. దీంతో కారు కడిగిన వ్యక్తికి అధికారులు రూ.10 వేల జరిమానా విధించారు. తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.



More Telugu News