బీహార్ కేబినెట్‌లో నేరస్థులు.. కోటీశ్వరులు: ఏడీఆర్ నివేదిక

  • బీహార్ మంత్రుల నేపథ్యంపై ఏడీఆర్ సంచలన నివేదిక
  • కేబినెట్‌లోని 24 మందిలో 11 మందిపై క్రిమినల్ కేసులు
  • 9 మందిపై అల్లర్లు, ఫోర్జరీ వంటి తీవ్రమైన ఆరోపణలు
  • మంత్రుల్లో 21 మంది కోటీశ్వరులేనని వెల్లడి
  • సగటున ఒక్కో మంత్రి ఆస్తి రూ.5.32 కోట్లుగా గుర్తింపు
బీహార్ రాష్ట్ర మంత్రివర్గంపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన నివేదిక సంచలనం సృష్టిస్తోంది. కేబినెట్‌లోని దాదాపు సగం మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, దాదాపు అందరూ కోటీశ్వరులేనని ఈ నివేదిక తేల్చి చెప్పింది. 2025 బీహార్ అసెంబ్లీకి సంబంధించి మొత్తం 24 మంది మంత్రుల ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించి ఏడీఆర్ ఈ వివరాలను వెల్లడించింది.

ఈ నివేదిక ప్రకారం 24 మంది మంత్రుల్లో 11 మందిపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. వీరిలో 9 మందిపై అల్లర్లు, ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు, మోసం, ఫోర్జరీ, తీవ్రంగా గాయపరచడం, ఎన్నికల నేరాలు వంటి తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. ఈ ఆరోపణలు పార్టీలకు అతీతంగా ఉండటం గమనార్హం. బీజేపీకి చెందిన ఆరుగురు, జేడీయూ నుంచి ఇద్దరు, ఎల్జేపీ(ఆర్‌వీ) నుంచి ఇద్దరు, హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) పార్టీకి చెందిన ఏకైక మంత్రిపైనా కేసులు ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొంది. అయితే, ఏ కేసులోనూ ఇప్పటివరకు వీరికి శిక్ష పడలేదని స్పష్టం చేసింది.

ఆర్థిక వివరాల విషయానికొస్తే, బీహార్ కేబినెట్ ఆర్థికంగా ఎంతో బలంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. 24 మంది మంత్రుల్లో 21 మంది కోటీశ్వరులే. మంత్రుల సగటు ఆస్తి విలువ రూ.5.32 కోట్లుగా ఉన్నట్లు వారి అఫిడవిట్లలో ప్రకటించారు. ఈ నివేదికతో బిహార్ రాజకీయాల్లో మంత్రుల నేపథ్యంపై మరోసారి చర్చ మొదలైంది.

బీజేపీకి చెందిన మంత్రి రామ్ నిషాద్ రూ. 31.86 కోట్లతో సంపన్న మంత్రిగా రికార్డులకెక్కగా, ఎల్‌జేపీ (ఆర్‌వీ)కి చెందిన సంజయ్‌కుమార్ రూ. 22.3 కోట్లతో అతి తక్కువ సంపద కలిగిన మంత్రిగా ఉన్నారు. 15 మంది మంత్రులకు అప్పులుండగా, విజయ్ కుమార్ సిన్హాకు అత్యధికంగా రూ. 82.33 లక్షల అప్పులున్నాయి.


More Telugu News