కెనడాలో టీనేజ్ అమ్మాయిలతో భారతీయుడి అసభ్య ప్రవర్తన.. శాశ్వత బహిష్కరణ

  • విజిటర్ వీసాపై కెనడా వెళ్లిన 51 ఏళ్ల జగ్జీత్ సింగ్‌ 
  • స్కూల్ సమీపంలో ఇద్దరు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన వైనం 
  • వేధింపుల కేసులో దోషిగా తేల్చిన న్యాయ‌స్థానం 
  • దేశం విడిచి వెళ్లాలని ఆదేశం.. తిరిగి రాకుండా నిషేధం
కెనడాలో ఇద్దరు టీనేజ్ అమ్మాయిలను వేధించిన కేసులో 51 ఏళ్ల భారత పౌరుడిని అక్కడి కోర్టు దోషిగా నిర్ధారించింది. అతడిని దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించడంతో పాటు భవిష్యత్తులో కెనడాలోకి తిరిగి ప్రవేశించకుండా నిషేధం విధించింది.

వివరాల్లోకి వెళితే... జగ్జీత్ సింగ్ అనే వ్యక్తి ఆరు నెలల విజిటర్ వీసాపై జులైలో కెనడాలోని ఒంటారియోకు వెళ్లాడు. అక్కడ అప్పుడే పుట్టిన తన మనవడిని చూసేందుకు వెళ్లిన ఆయన, స్థానికంగా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నాడు. సార్నియా ప్రాంతంలోని ఒక హైస్కూల్ వెలుపల ఉన్న స్మోకింగ్ ఏరియాకు తరచూ వెళ్తూ, అక్కడి విద్యార్థినులను వేధించడం మొదలుపెట్టాడు.

కెనడియన్ మీడియా కథనాల ప్రకారం, సెప్టెంబర్ 8 నుంచి 11 మధ్య జగ్జీత్ సింగ్ పలుమార్లు స్కూల్ విద్యార్థినులను సమీపించి, వారితో ఫొటోలు దిగేందుకు ప్రయత్నించాడు. డ్రగ్స్, ఆల్కహాల్ గురించి మాట్లాడటంతో పాటు ఒక అమ్మాయి భుజంపై చేయి వేయబోయాడు. దీంతో భయపడిన విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనికి ఇంగ్లీష్ రాదని, స్కూల్ నుంచి ఇంటికి వెళుతున్న అమ్మాయిలను వెంబడించాడని కూడా దర్యాప్తులో తేలింది.

సెప్టెంబర్ 16న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చినప్పటికీ, మరో ఫిర్యాదు అందడంతో మళ్లీ అరెస్టయ్యాడు. చివరకు సెప్టెంబర్ 19న కోర్టులో వేధింపుల నేరాన్ని అంగీకరించాడు.

విచారణ సందర్భంగా న్యాయమూర్తి క్రిస్టా లిన్ లెస్జిన్‌స్కీ తీవ్రంగా స్పందించారు. "హైస్కూల్ ఆవరణకు వెళ్లాల్సిన అవసరం అతనికి లేదు. ఇలాంటి ప్రవర్తనను సహించేది లేదు" అని వ్యాఖ్యానించారు. డిసెంబర్ 30న భారత్‌కు తిరిగి వెళ్లేందుకు టికెట్ ఉందని జగ్జీత్ తరఫు న్యాయవాది చెప్పినప్పటికీ, న్యాయమూర్తి వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. అంతేకాకుండా బాధితులతో మాట్లాడకుండా, వారుండే ప్రాంతాలకు వెళ్లకుండా మూడేళ్ల పాటు ప్రొబేషన్ విధించారు.


More Telugu News