ఐ-బొమ్మ రవి మూడో రోజు విచారణ... దేశ, విదేశాల్లోని సంబంధాలపై ఆరా

  • రవిని ఐదు రోజుల పోలీసుల కస్టడీకి ఇచ్చిన నాంపల్లి కోర్టు
  • నేడు మూడో రోజు ముగిసిన ఐ-బొమ్మ రవి విచారణ
  • విదేశాల్లోని లింకులు, ఆస్తులపై ప్రశ్నించిన అధికారులు
ఐ-బొమ్మ నిర్వాహకుడు రవి మూడో రోజు విచారణ ముగిసింది. రవిని నాంపల్లి కోర్టు ఐదు రోజుల కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు అతడిని కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. మూడో రోజు విచారణలో భాగంగా రవికి ఏజెంట్లు, గేమింగ్ యాప్‌ల నిర్వాహకులతో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. మన దేశంతో పాటు విదేశాల్లో ఉన్న లింకులు, ఆస్తులపై కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఎవరెవరు సహకరిస్తున్నారు, ఈ వ్యవహారంలో రవి వెనుక ఎంతమంది ఉన్నారనే విషయాలపై ప్రశ్నించారని సమాచారం. సైబర్ నేరాలకు ఐ-బొమ్మ వెబ్‌సైట్‌ను నేరగాళ్లు వేదికగా మలుచుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా విడుదలైన సినిమాలను సేకరించే విధానం, ఐ-బొమ్మ సహా మిర్రర్ సైట్‌లలోకి అప్‌లోడ్ చేసే విధానంపై పోలీసులు సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు.


More Telugu News