మోక్షజ్ఞ డెబ్యూ ఆ సినిమాతోనేనా?.. బాలయ్య సంచలన ప్రకటన

  • ‘ఆదిత్య 999 మ్యాక్స్’ రాకను ధ్రువీకరించిన బాలకృష్ణ
  • ఈ చిత్రంలో తనతో పాటు కుమారుడు మోక్షజ్ఞ నటిస్తారని వెల్లడి
  • గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ వేడుకలో కీలక ప్రకటన
  • ఈ క్రేజీ ప్రాజెక్టుకు క్రిష్ దర్శకత్వం వహించే అవకాశం
  • మోక్షజ్ఞ డెబ్యూ ఇదేనా? అనే దానిపై ఆసక్తికర చర్చ
వరుస బ్లాక్‌బస్టర్లతో జోరు మీదున్న నటసింహ నందమూరి బాలకృష్ణ తన అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పారు. తన కుమారుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై ఎప్పటినుంచో ఉన్న ఉత్కంఠకు తెరదించుతూ కీలక ప్రకటన చేశారు. ఐకానిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’కు సీక్వెల్‌గా రానున్న ‘ఆదిత్య 999 మ్యాక్స్’లో మోక్షజ్ఞ కూడా నటించబోతున్నట్లు అధికారికంగా ధ్రువీకరించారు.

గోవాలో జరుగుతున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుకల్లో పాల్గొన్న బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఆదిత్య 999 మ్యాక్స్ త్వరలోనే వస్తుంది. ఈ చిత్రంలో నేను, మోక్షజ్ఞ కలిసి నటిస్తాం” అని స్పష్టం చేశారు. దీంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఎన్నో ఏళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వార్త కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

1991లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఆదిత్య 369’ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. దాదాపు 35 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్‌కు క్రిష్ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే, మోక్షజ్ఞ సినీ అరంగేట్రం ఈ భారీ ప్రాజెక్టుతోనే ఉంటుందా? లేదా అంతకంటే ముందుగా మరో సోలో చిత్రంతో హీరోగా పరిచయమవుతారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


More Telugu News