అన్నిటికీ నన్ను బాధ్యుడిని చేయొద్దు: పోలీసు విచారణలో ఐబొమ్మ రవి

  • ఐబొమ్మ రవి కస్టడీలో కీలక విషయాల వెల్లడి
  • బెట్టింగ్ యాప్స్ డబ్బుతో పైరసీ సినిమాలు కొనుగోలు
  • మూవీరూల్స్ నుంచి సినిమాలు.. క్రిప్టో కరెన్సీలో చెల్లింపులు
  • కరేబియన్ దీవుల్లో ఆఫీస్ ఏర్పాటు చేసి నెట్‌వర్క్ నిర్వహణ
  • రవి అరెస్ట్ అయినా ఆగని పైరసీ.. కొత్త వెబ్‌సైట్ల ఏర్పాటు
పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమంది రవి పోలీసు కస్టడీలో కీలక విషయాలు వెల్లడిస్తున్నాడు. ఐదు రోజుల కస్టడీలో భాగంగా రెండోరోజైన శుక్రవారం సైబర్‌క్రైమ్ పోలీసులు జరిపిన విచారణలో పైరసీ నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటపడ్డాయి. బెట్టింగ్ యాప్‌ల ద్వారా సంపాదించిన డబ్బుతోనే రవి పైరసీ సినిమాలను కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

విచారణలో తేలిన వివరాల ప్రకారం, రవి తన ఐబొమ్మ వెబ్‌సైట్‌ను బెట్టింగ్ యాప్‌లకు ఒక గేట్‌వేగా ఉపయోగించాడు. వాటి ద్వారా వచ్చిన ఆదాయంతో ‘మూవీరూల్స్’ వంటి తమిళ, హిందీ పైరసీ వెబ్‌సైట్ల నుంచి కొత్త సినిమాలను పెద్దఎత్తున కొనుగోలు చేశాడు. ఈ లావాదేవీల కోసం క్రిప్టో కరెన్సీని ఉపయోగించినట్లు పోలీసులు నిర్ధారించారు. అంతేకాకుండా, ఈ పైరసీ కార్యకలాపాలను వ్యవస్థీకృతంగా నిర్వహించేందుకు కరేబియన్ దీవుల్లో ఏకంగా ఒక ఆఫీసును ఏర్పాటు చేసి, 20 మంది ఉద్యోగులను నియమించుకున్నట్లు తేలింది.

అయితే, రవి విచారణకు పూర్తిగా సహకరించడం లేదని, చెప్పిన విషయాలనే మళ్లీ మళ్లీ చెబుతున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి. తన ద్వారా తెరుచుకున్న వెబ్‌సైట్లను మాత్రమే మూసివేస్తానని, అన్నింటికీ తనను బాధ్యుడిని చేయవద్దని రవి అంటున్నట్లు సమాచారం. రవి కస్టడీలో ఉండగానే ‘ఐబొమ్మ వన్’ పేరుతో మరో సైట్ ప్రత్యక్షమవడం, పాత సైట్ ‘మూవీరూల్స్’కు రీడైరెక్ట్ కావడం పోలీసులకు సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో రవిపై నమోదైన మరో నాలుగు కేసుల్లోనూ పీటీ వారెంట్ దాఖలు చేసి, మొత్తం నెట్‌వర్క్‌ను ఛేదించాలని పోలీసులు భావిస్తున్నారు.


More Telugu News