టూరిస్ట్ నిర్లక్ష్యంతో కాలిబూడిదైన పురాతన ఆలయం.. వీడియో ఇదిగో!

  • ప్రార్థనలో భాగంగా క్యాండిల్ వెలిగించిన యాత్రికుడు
  • క్యాండిల్ ను నిర్లక్ష్యంగా వదిలేయడంతో అగ్ని ప్రమాదం
  • చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్ లో ఘటన
చైనాలోని పురాతన ఆలయాలు, చారిత్రక ప్రదేశాల సందర్శనకు వెళ్లిన ఓ యాత్రికుడు అక్కడి ఓ ఆలయం కాలిబూడిద కావడానికి కారకుడయ్యాడు. దైవ ప్రార్థన కోసం వెలిగించిన కొవ్వొత్తిని నిర్లక్ష్యంగా వదిలేయడంతో మంటలు ఎగసిపడి ఆలయం మొత్తం కాలిబూడిదైంది. చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్ లోని వెంచాంగ్ పెవిలియన్ ఆలయం శిథిలాల కుప్పగా మారిపోయింది. అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వెంచాంగ్ పెవిలియన్ ఆలయం మూడు అంతస్తుల్లో నిర్మించారు. 2009లో నిర్మాణం పూర్తయింది. కొండపై ఉన్న ఈ ఆలయం స్థానికంగా ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. పర్యాటకులతో పాటు స్థానికులు కూడా ఇక్కడ పూజలు చేస్తుంటారు. ఇందులో భాగంగా దైవారాధన కోసం క్యాండిల్ వెలిగించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. 

ఈ క్రమంలోనే ఈ నెల 12న ఆలయాన్ని సందర్శించిన ఓ పర్యాటకుడు కొవ్వొత్తి వెలిగించి నిర్ణీత ప్రదేశంలో ఉంచకుండా పక్కన పెట్టాడు. దీంతో ఆ కొవ్వొత్తి కరిగి మంటలు అంటుకున్నాయి. మూడు అంతస్తులకు విస్తరించిన మంటలు.. ఆలయాన్ని బుగ్గిచేశాయి. కాగా, ఈ ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఆలయ పునర్నిర్మాణ పనులు మొదలు పెడతామని చెప్పారు.


More Telugu News