తెలంగాణ పంచాయతీ పోరు: బీసీ రిజర్వేషన్లకు భారీ కోత.. డిసెంబర్‌లో నోటిఫికేషన్?

  • తెలంగాణలో కొలిక్కి వచ్చిన పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ
  • బీసీ రిజర్వేషన్ల కోటా 22.3 శాతానికి తగ్గింపు
  • మిగిలిన 19.7 శాతం సీట్లు జనరల్ కేటగిరీకి బదిలీ
  • ఈ నెల‌ 24న హైకోర్టు తీర్పు తర్వాత తుది జాబితాపై నిర్ణయం
  • డిసెంబర్ తొలి వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు సంబంధించిన రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అయితే, ఈ కసరత్తులో బీసీ రిజర్వేషన్ల కోటాలో భారీగా కోత విధించడం కీలక పరిణామంగా మారింది.

జిల్లాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు స్థానాల కేటాయింపు ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు, 2024లో నిర్వహించిన కులగణన సర్వే ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు కేటాయించారు. రొటేషన్ పద్ధతిని పాటిస్తూ 2019 ఎన్నికల జాబితాను పరిశీలించి తాజా కేటాయింపులు చేశారు.

ఈసారి రిజర్వేషన్ల ఖరారులో బీసీ కోటాలో ప్రభుత్వం కీలక మార్పు చేసింది. గతంలో ప్రాథమికంగా 42 శాతంగా ప్రతిపాదించిన బీసీ రిజర్వేషన్లను తాజాగా 22.3 శాతానికి పరిమితం చేశారు. దీనివల్ల తగ్గిన 19.7 శాతం స్థానాలను జనరల్ కేటగిరీకి మార్చారు. ఈరోజు మహిళా రిజర్వుడు స్థానాలను కూడా ఖరారు చేసి, జిల్లా స్థాయి జాబితాలను పంచాయతీరాజ్ శాఖ కార్యాలయానికి పంపనున్నారు.

రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయినప్పటికీ, తుది జాబితాను ప్రభుత్వం వెంటనే విడుదల చేయడం లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఈ నెల 24న హైకోర్టు తీర్పు వెలువడనుంది. ఆ మరుసటి రోజు, అంటే 25న జరిగే రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఈ తీర్పుపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. కేబినెట్ ఆమోదం తర్వాతే అధికారికంగా జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.

ఈ పరిణామాలతో సర్పంచ్, వార్డు సభ్యుల పదవుల ఆశావహులు హైకోర్టు తీర్పు, కేబినెట్ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, డిసెంబర్ తొలి వారంలోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


More Telugu News