సినిమా పైరసీకి చెక్ పెట్టాలంటే.. రామ్ గోపాల్ వర్మ చెప్పిన కొత్త ఐడియా ఇదే!

  • సినిమా పైరసీపై స్పందించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
  • పైరసీ చేసేవారిని రాబిన్ హుడ్‌తో పోల్చడంపై తీవ్ర ఆగ్రహం
  • కేవలం సప్లయర్లే కాదు, చూసేవారు కూడా నేరస్థులేనన్న ఆర్జీవీ
  • వందమంది పైరసీ వీక్షకులను అరెస్ట్ చేసి పేర్లు బయటపెట్టాలని సూచన
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. సినీ పరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీ సమస్యపై ఆయన సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పైరసీని అరికట్టాలంటే కేవలం దాన్ని అందించేవారినే కాకుండా, చూసే ప్రేక్షకులను కూడా శిక్షించాలని సంచలన సూచన చేశారు.

తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో వర్మ స్పందిస్తూ... "పైరసీని ఎప్పటికీ ఆపలేం. టెక్నాలజీ బలంగా ఉండటం వల్లనో, పోలీసింగ్ బలహీనంగా ఉండటం వల్లనో కాదు. పైరసీ సినిమాలు చూసే జనాలు ఉన్నంత కాలం, వారికి సేవ చేయడానికి రవి లాంటి వారు పుట్టుకొస్తూనే ఉంటారు" అని పేర్కొన్నారు. పైరసీ చేసే వారిని రాబిన్ హుడ్‌తో పోల్చడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. "అసలు రాబిన్ హుడ్ హీరో కాదు. నేటి నిర్వచనాల ప్రకారం అతను ప్రపంచంలోనే మొదటి టెర్రరిస్ట్. ధనవంతులుగా ఉండటమే నేరమన్నట్లు వారిని దోచుకుని, చంపి పేదలకు పంచాడు. ఒక నేరస్థుడిని హీరోగా కీర్తించడం మూర్ఖత్వం" అని విమర్శించారు.

సినిమా టికెట్లు ఖరీదుగా ఉన్నాయంటూ పైరసీని సమర్థించే వారిని కూడా వర్మ వదల్లేదు. "ఇదే లాజిక్‌తో ఆలోచిస్తే, బీఎండబ్ల్యూ షోరూంలను దోచుకుని, కార్లను ప్రజలకు ఉచితంగా పంచాలి. ఇలాంటి ఆలోచనలు సమాజాన్ని అరాచకత్వంలోకి నెడతాయి" అని హెచ్చరించారు. సౌలభ్యం, సమయం, డబ్బు ఆదా చేసుకోవడం కోసమే సినీ పరిశ్రమకు చెందిన వారితో సహా చాలామంది పైరసీ చూస్తున్నారని ఆరోపించారు.

పైరసీని అరికట్టేందుకు ఒక పరిష్కారాన్ని కూడా వర్మ సూచించారు. "పైరసీ సప్లయర్‌ను పట్టుకోవడం కష్టం. కానీ చూసేవారిని పట్టుకోవడం సులభం. ఒక 100 మంది పైరసీ వీక్షకులను అరెస్ట్ చేసి, వారి పేర్లను బహిరంగపరిస్తే ఈ సమస్యకు అడ్డుకట్ట పడుతుంది" అని వ‌ర్మ‌ వెల్లడించారు.


More Telugu News