రేవంత్ రెడ్డి ఇప్పుడేం చేస్తారో చూడాలి: ప్రాసిక్యూషన్‌కు కేటీఆర్‌ను అనుమతించడంపై బండి సంజయ్

  • బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని రేవంత్ రెడ్డి విమర్శిస్తుంటారన్న బండి సంజయ్
  • గవర్నర్ ప్రాసిక్యూషన్‌ను అనుమతి ఇవ్వవద్దనే సీఎం కోరుకున్నారని వ్యాఖ్య
  • అవినీతిపరుల ఆస్తులను జప్తు చేస్తానని రేవంత్ రెడ్డి గతంలో అన్నారని వెల్లడి
ఫార్ములా ఈ-కారు రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ ప్రాసిక్యూషన్‌కు తెలంగాణ గవర్నర్ అనుమతిచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ ఏమి చెబుతుందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించడాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమి చేస్తారో చూడాలని అన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని నిత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శిస్తుంటారని ఆయన గుర్తు చేశారు. ఇన్నాళ్లూ గవర్నర్ అనుమతి ఇవ్వవద్దనే ముఖ్యమంత్రి కోరుకున్నారని వ్యాఖ్యానించారు. అవినీతిపరుల ఆస్తులను జప్తు చేస్తామని రేవంత్ రెడ్డి గతంలో అన్నారని, ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇచ్చినందున ఆ దిశగా ఏమైనా చర్యలు తీసుకుంటారా అని ఆయన ప్రశ్నించారు.

మావోయిస్టుల అంశంపై కూడా బండి సంజయ్ స్పందించారు. అర్బన్ నక్సలైట్లు చిన్నపిల్లలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. కార్లలో తిరుగుతూ సొంత పైరవీలు చేసుకుంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని అమాయక యువత అర్థం చేసుకోవాలని సూచించారు.


More Telugu News