ప్రేమ వివాహం, ఆర్థిక కష్టాలు.. ఐ బొమ్మ రవి జీవితంలో అసలేం జరిగింది?

  • ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్.. మద్దతుగా నెటిజన్లు
  • కుటుంబానికి దూరంగా ఒంటరి జీవితం గడుపుతున్న రవి
  • వైవాహిక జీవితంలోని చేదు అనుభవాలే కారణమని వెల్లడి
  • పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి ఆసక్తికర విషయాలు
తెలుగు రాష్ట్రాల్లో పైరసీ సినిమాలకు అడ్డాగా మారిన ‘ఐ బొమ్మ’ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమంది రవి అరెస్ట్ వ్యవహారం సంచలనంగా మారింది. గత ఏడు రోజులుగా వెబ్‌సైట్ నిలిచిపోవడం, ఇప్పుడు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు నెటిజన్లు రవికి మద్దతుగా నిలుస్తూ న్యాయసహాయం అందిస్తామని పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో రవి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన, విషాదకరమైన కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఈ నెల 14న కూకట్‌పల్లిలోని రవి నివాసంలో పోలీసులు తనిఖీలు చేసినప్పుడు ఇల్లు మొత్తం చిందరవందరగా, దుమ్ముపట్టి ఉండటాన్ని గమనించారు. వైవాహిక జీవితంలో ఎదురైన చేదు అనుభవం కారణంగా అతడు మనుషులపై నమ్మకం కోల్పోయి, గత నాలుగేళ్లుగా కుటుంబానికి దూరంగా ఒంటరిగా జీవిస్తున్నాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తన ఆచూకీ బయటపడుతుందనే భయంతో ఇంట్లో పనివాళ్లను కూడా పెట్టుకోలేదు. అతడి సెల్‌ఫోన్‌లో కేవలం ఫుడ్ డెలివరీ బాయ్స్ నంబర్లు మాత్రమే ఉండటం పోలీసులను ఆశ్చర్యపరిచింది. ఇంటి డోర్‌కు కెమెరా అమర్చుకుని, ఎవరొచ్చినా ముందుగా పరిశీలించాకే తలుపు తీసేవాడని తేలింది.

అమీర్‌పేట్‌లోని ఒక కోచింగ్ సెంటర్‌లో పరిచయమైన యువతిని రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారి కాపురం ఏడాది పాటు సంతోషంగా సాగింది. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. అదే సమయంలో భార్య అక్క విదేశాల్లో తమ కుటుంబాలు ఉన్నతంగా ఉన్నాయని ఎగతాళి చేయడంతో పాటు, దానికి భార్య, అత్త వంత పాడటంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో భార్యాభర్తలు విడిపోయారు. భార్య తన కూతుర్ని తీసుకుని వెళ్లిపోవడంతో రవి పూర్తిగా ఒంటరివాడయ్యాడు. అప్పటి నుంచి పైరసీ, గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల నిర్వహణ, విదేశీ పర్యటనలతోనే కాలం గడుపుతున్నాడని దర్యాప్తులో వెల్లడైంది. కూతురిని చూడాలని ఉన్నా అవకాశం దక్కడం లేదని రవి ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.


More Telugu News