నెయ్యి తర్వాత జీడిపప్పు.. టీటీడీలో ఆగని అక్రమాలు!

  • నెయ్యి వివాదం తర్వాత టీటీడీలో జీడిపప్పు టెండర్ల కలకలం
  • నకిలీ వే బిల్లులు సమర్పించిన రెండు చెన్నై సంస్థలు
  • నిబంధనలకు విరుద్ధంగా రూ.56 లక్షల ఈఎండీ వాపసు
  • సంస్థలను బ్లాక్‍లిస్ట్ చేయకుండా మళ్లీ టెండర్లకు అనుమతి
శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యత విషయంలో విమర్శలు ఎదుర్కొన్న టీటీడీ మరో వివాదంలో చిక్కుకుంది. తాజాగా జీడిపప్పు కొనుగోలుకు సంబంధించి పిలిచిన టెండర్లలో నకిలీ పత్రాలు సమర్పించిన సంస్థలపై చర్యలు తీసుకోకపోగా, వారికి అధికారులు వత్తాసు పలకడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. 1.20 లక్షల కిలోల జీడిపప్పు సరఫరా కోసం టీటీడీ సెప్టెంబరు 3న టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ టెండర్‌లో చెన్నైకి చెందిన క్రిస్టీ క్వాలిటీ ఫుడ్స్‌, ఫంక్షనల్‌ అండ్‌ ఇన్నోవేటివ్‌ ఫుడ్స్‌తో పాటు పలు సంస్థలు పాల్గొన్నాయి. నిబంధనల ప్రకారం, టెండర్‌లో పాల్గొనే సంస్థకు కనీసం 75 వేల కేజీల జీడిపప్పు సరఫరా చేసిన అనుభవం ఉండాలి. అయితే చెన్నైకి చెందిన ఈ రెండు సంస్థలు సమర్పించిన వేబిల్లులను క్యూఆర్‌ కోడ్‌తో స్కాన్‌ చేయగా, అవి నకిలీవని తేలింది. దీంతో అధికారులు వాటిని టెండర్ల నుంచి డిస్‌క్వాలిఫై చేశారు.

నిబంధనల ప్రకారం తప్పుడు పత్రాలతో టెండర్లలో పాల్గొన్న సంస్థల ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌ (ఈఎండీ)ను జప్తు చేయాలి. వాటిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి, విజిలెన్స్‌ విభాగానికి ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించాలి. కానీ, టీటీడీ అధికారులు ఇవేవీ పట్టించుకోకుండా ఆ రెండు సంస్థలకు చెందిన రూ.56 లక్షల ఈఎండీని తిరిగి ఇచ్చేశారు. కనీసం ఆ సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో కూడా చేర్చలేదు. పైగా, భవిష్యత్తులో జరిగే టెండర్లలో పాల్గొనేందుకు వీలు కల్పించారు. తాజాగా పిలిచిన యాలకుల టెండర్లోనూ ఈ సంస్థలు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై టీటీడీ అధికారుల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది.


More Telugu News