భారత టాప్-100 బ్రాండ్ల విలువ రూ.46 లక్షల కోట్లు

  • భారత్‌లో అత్యంత విలువైన బ్రాండ్‌గా మరోసారి హెచ్‌డీఎఫ్‌సీ
  • రెండో స్థానంలో టీసీఎస్‌, మూడో స్థానంలో ఎయిర్‌టెల్
  • టాప్-100 బ్రాండ్ల మొత్తం విలువ రూ.46.32 లక్షల కోట్లు
  • వేగంగా ఎదుగుతున్న బ్రాండ్‌గా వరుసగా రెండో ఏడాది జొమాటో
  • కాంటార్ బ్రాండ్స్ రిపోర్ట్ 2025లో వెల్లడి
భారతదేశంలోని టాప్-100 బ్రాండ్ల సత్తా మరోసారి నిరూపితమైంది. ఈ ఏడాది వాటి మొత్తం విలువ 52,350 కోట్ల డాలర్లకు (సుమారు రూ.46.32 లక్షల కోట్లు) చేరినట్లు లండన్‌కు చెందిన ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ కాంటార్ వెల్లడించింది. ఈ మొత్తం విలువ భారత జీడీపీలో దాదాపు 13 శాతానికి సమానమని బుధవారం విడుదల చేసిన ‘కాంటార్ బ్రాండ్స్ రిపోర్ట్ 2025’లో పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఈ బ్రాండ్ల మొత్తం విలువ 6 శాతం పెరిగింది.

నివేదిక ప్రకారం ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మరోసారి దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా అగ్రస్థానంలో నిలిచింది. ఈ బ్యాంక్ బ్రాండ్ విలువ 18 శాతం వృద్ధితో దాదాపు 4,500 కోట్ల డాలర్లకు (రూ.3.98 లక్షల కోట్లు) చేరుకుంది. 2014లో ఈ రిపోర్టు ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే హెచ్‌డీఎఫ్‌సీ బ్రాండ్ విలువ నాలుగింతలకు పైగా పెరగడం గమనార్హం.

ఈ జాబితాలో దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 4,420 కోట్ల డాలర్ల (రూ.3.91 లక్షల కోట్లు) విలువతో రెండో స్థానంలో నిలిచింది. టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ 4,110 కోట్ల డాలర్ల (రూ.3.64 లక్షల కోట్లు) విలువతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఐదో స్థానంలో, ఐసీఐసీఐ బ్యాంక్ ఆరో స్థానంలో ఉన్నాయి.

బ్రాండ్ విలువ పరంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో వరుసగా రెండో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది కాలంలో జొమాటో బ్రాండ్ విలువ ఏకంగా 69 శాతం పెరిగింది. ఈసారి జాబితాలో అల్ట్రాటెక్ సిమెంట్, హ్యుండయ్‌తో సహా 18 కొత్త కంపెనీలకు చోటు దక్కింది. 111 విభాగాలకు చెందిన 1,620 బ్రాండ్లపై 1.45 లక్షల మంది అభిప్రాయాల ఆధారంగా ఈ ర్యాంకింగ్‌లను రూపొందించినట్లు కాంటార్ తెలిపింది.


More Telugu News