ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. అగ్రస్థానం కోల్పోయిన రోహిత్ శర్మ

  • ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్
  • 46 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన రెండో కివీస్ ప్లేయర్‌గా రికార్డు
  • టెస్ట్ బౌలింగ్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న జస్‌ప్రీత్ బుమ్రా
  • టెస్ట్ బ్యాటింగ్‌లో తొలిసారి టాప్-5లోకి దూసుకొచ్చిన టెంబా బవుమా
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో కీలక పరిణామం నమోదైంది. టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్, రోహిత్‌ను వెనక్కి నెట్టి తొలిసారి ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా అవతరించాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో సెంచరీ సాధించడంతో మిచెల్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకాడు.

ఈ ఘనత సాధించిన రెండో న్యూజిలాండ్ ఆటగాడిగా డారిల్ మిచెల్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు 1979లో గ్లెన్ టర్నర్ మాత్రమే కివీస్ తరఫున ఈ ఫీట్ సాధించారు. కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, మార్టిన్ గప్టిల్ వంటి దిగ్గజ ఆటగాళ్లు సైతం కెరీర్‌లో టాప్-5కి పరిమితమయ్యారు కానీ, నంబర్ వన్ స్థానాన్ని అందుకోలేకపోయారు.

ఇక టెస్ట్ ర్యాంకింగ్స్‌లోనూ పలు మార్పులు చోటుచేసుకున్నాయి. భారత స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా టెస్టుల్లో తన నంబర్ వన్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. కుల్దీప్ యాదవ్ కెరీర్ బెస్ట్ 13వ ర్యాంకుకు, రవీంద్ర జడేజా 15వ స్థానానికి చేరుకున్నారు. బ్యాటింగ్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 11వ ర్యాంకుకు చేరగా, దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తొలిసారి టాప్-5లోకి ప్రవేశించాడు.

ఇతర ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్ తమ వన్డే ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వన్డే బౌలింగ్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 


More Telugu News