అభిమానిపై బాలకృష్ణ అసహనం.. 'సాయంత్రం కనపడొద్దు' అంటూ వార్నింగ్!

  • 'అఖండ 2' ప్రమోషన్స్ కోసం విశాఖ వెళ్లిన బాలకృష్ణ
  • విమానాశ్రయంలో ఓ అభిమానిపై తీవ్ర ఆగ్రహం
  • అనంతరం సింహాచలంలో అప్పన్నకు ప్రత్యేక పూజలు
'అఖండ 2' సినిమా ప్రమోషన్స్ కోసం విశాఖపట్నం చేరుకున్న నందమూరి బాలకృష్ణకు ఊహించని అనుభవం ఎదురైంది. నటుడు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుకు విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో అభిమానులను అదుపుచేసే సమయంలో బాలకృష్ణ ఓ అభిమానిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

విమానాశ్రయంలోని అభిమానుల గుంపులో ఒకరిని చూస్తూ "వీడెందుకు వచ్చాడు?" అని ఆగ్రహించిన బాలకృష్ణ, "సాయంత్రం కూడా వీడు కనపడకూడదు" అంటూ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేయగా, ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఈ సంఘటన అనంతరం బాలకృష్ణ, బోయపాటి శ్రీను నేరుగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహాచలం చేరుకున్నారు. అక్కడ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. సంప్రదాయం ప్రకారం కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్న అనంతరం, గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించారు.

బాలకృష్ణకు నరసింహస్వామి ఇలవేల్పు. తన సినిమాల విడుదలకు ముందు సింహాద్రి అప్పన్నను దర్శించుకోవడం ఆయనకు ఆనవాయతీ. 'అఖండ 2' చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటూ స్వామివారిని దర్శించుకున్నట్లు చిత్రబృందం తెలిపింది. 


More Telugu News